Share News

Smriti Irani in Medina : మదీనలో స్మృతి ఇరానీ!

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:44 AM

ముస్లింలకు పవిత్రమైన మదీనలో పర్యటించి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. మదీన నగరంలో పర్యటించిన తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా ఆమె చరిత్రకెక్కారు.

Smriti Irani in Medina : మదీనలో స్మృతి ఇరానీ!

తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా కేంద్ర మంత్రి రికార్డు

మస్జిదే ఖుబా, ఉహుద్‌ పర్వత ప్రాంతాల సందర్శన

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : ముస్లింలకు పవిత్రమైన మదీనలో పర్యటించి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. మదీన నగరంలో పర్యటించిన తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా ఆమె చరిత్రకెక్కారు. మదీనలో స్మృతి పర్యటించిన వీడియోలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సంప్రదాయక ముస్లిం వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఇది నమ్మలేని చాలామంది ఫోన్లు చేసి మరీ ఆరా తీశారు. హజ్‌ కోటాపై సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకోవడానికి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం సౌదీకి వచ్చారు.

Untitled-3.jpg

ఆదివారం సౌదీ అరేబియా హజ్‌ మంత్రితో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం సోమవారం స్మృతి తన అధికారిక బృందంతో కలిసి జెద్ధా నుంచి రైలులో మదీనకు వెళ్లారు. అక్కడ మస్జీదే నబ్వీ సరిహద్దు ప్రహరీ గోడ వరకు వెళ్లిన ఆమె.. అనంతరం మస్జీదే ఖుబా, ఉహుద్‌ పర్వత ప్రాంతాన్ని కూడా సందర్శించారు. మదీనలోని భారత పర్యాటకులను కలసి యాత్రకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ‘ఇస్లాం ఆవిర్భవించిన ఈ ప్రాంతాన్ని సందర్శించడం చరిత్రాత్మకం. సౌదీ అధికారుల సాయంతో మదీనలోని పలు పవిత్ర స్థలాలను దర్శించుకున్నాం’ అని ‘ఎక్స్‌’లో పేర్కొంటూ పలు ఫొటోలను స్మృతి పోస్టు చేశారు. మదీనలో సాధారణంగా ముస్లింలకు మాత్రమే ప్రవేశముంటుంది కానీ గత కొంతకాలంగా ముస్లిమేతరులను కూడా అనుమతిస్తున్నారు. అయితే వీరు మస్జీదే నబ్వీ సరిహద్దు గోడ వరకు మాత్రమే వెళ్లవచ్చు.

Updated Date - Jan 09 , 2024 | 05:02 PM