Share News

చైనా వస్తువులతో చిన్న పరిశ్రమలు కుదేలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:58 AM

చైనా వస్తువులు వరదలా వచ్చి పడుతుండడంతో స్వదేశీ, చిన్న, కుటీర పరిశ్రమలు కుదేలు అవుతున్నాయని, వృత్తిదారులు ఉపాధి కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

చైనా వస్తువులతో చిన్న పరిశ్రమలు కుదేలు

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌

అలీగఢ్‌లో యాత్రకు హాజరైన అఖిలేశ్‌

అలీగఢ్‌, ఫిబ్రవరి 25: చైనా వస్తువులు వరదలా వచ్చి పడుతుండడంతో స్వదేశీ, చిన్న, కుటీర పరిశ్రమలు కుదేలు అవుతున్నాయని, వృత్తిదారులు ఉపాధి కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేస్తున్న ఆయన ఆదివారం మొరాదాబాద్‌ నుంచి సంభల్‌ మీదుగా అలీగఢ్‌కు చేరుకున్నారు. రాహుల్‌ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్‌కు కాంగ్రెస్‌, ఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. తాళాల పరిశ్రమకు అలీగఢ్‌ ప్రసిద్ధి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ చైనా నుంచి చౌక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తుతూ ఇలాంటి పరిశ్రమలను దెబ్బ తీస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మాట్లాడుతూ సైన్యంలో చేరాలని కలలు కన్న యువత కలలను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్‌ పథకం భగ్నం చేసిందని విమర్శించారు. ఈ ‘అన్యాయ కాలం’లో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సంక్షోభంగా ఉందన్నారు. అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారని, వారి శక్తిని చూసి కేంద్రం భయపడుతోందన్నారు. ఇండియా కూటమి బీజేపీని గద్దె దింపుతుందని వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 26 , 2024 | 05:58 AM