Share News

జెలెన్‌స్కీ, గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ సమీపంలో రష్యా క్షిపణి దాడి

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:28 AM

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీసే పరిణామం త్రుటిలో తప్పింది. నాటో సభ్య దేశమైన గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సొటకిస్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కాన్వాయ్‌కి 500మీటర్ల దూరంలో

జెలెన్‌స్కీ, గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ సమీపంలో రష్యా క్షిపణి దాడి

కాన్వాయ్‌కు 500 మీటర్ల దూరంలోనే ఘటన

ఐదుగురి మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

ఒడెస్సా, మార్చి 7: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీసే పరిణామం త్రుటిలో తప్పింది. నాటో సభ్య దేశమైన గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సొటకిస్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కాన్వాయ్‌కి 500మీటర్ల దూరంలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రష్యా తమపై యుద్ధానికి దిగి రెండేళ్లయిన సందర్భంగా జెలెన్‌స్కీ మిత్రదేశాల నాయకులను పిలిచి జరిగిన నష్టాన్ని వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలో కిరియాకో్‌సను నల్ల సముద్ర తీర నగరం ఒడెస్సా సందర్శనకు తీసుకెళ్లారు. పర్యటన ముగించుకుని దేశాధినేతలిద్దరూ వాహనాల్లోకి ఎక్కబోతుండగా సమీపంలో క్షిపణి దాడి జరిగింది. వీరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ..ఎంతటి బలమైన శత్రువుతో పోరాడుతున్నామో గమనించాలని కోరారు. గగనతల రక్షణ వ్యవస్థ ద్వారానే తమను తాము రక్షించుకోగలమన్నారు. కాగా, క్షిపణితో ఒడెస్సాలోని హ్యాంగర్‌పై దాడి చేశామని, అక్కడ యుద్ధంలో వాడేందుకు మానవరహిత బోట్ల తయారీ జరుగుతోందని రష్యా వెల్లడించింది. ఒడెస్సా.. దక్షిణ ఉక్రెయిన్‌ నౌకా దళానికి ప్రధాన స్థావరం. ధాన్యం ఎగుమతులకు కీలక కేంద్రం. దీంతో యుద్ధం మొదటినుంచీ రష్యా ఈ నగరంపై భీకర దాడులకు పాల్పడుతోంది. అద్భుతమైన కట్టడాలు, బీచ్‌తో అందమైన నగరంగా పేరున్న ఒడెస్సా ఇప్పుడు రూపురేఖలు కోల్పోయింది. గత ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌పై రష్యా క్షిపణి దాడిలో ఐదుగురు పిల్లలు సహా 12మంది చనిపోయారు. వీరికి నివాళి అర్పించేందుకే గ్రీస్‌ ప్రధానిని జెలెన్‌స్కీ ఆహ్వానించడం గమనార్హం.

Updated Date - Mar 08 , 2024 | 07:41 AM