ఝార్ఖండ్‌లో సీట్ల పంపకంపై ఆర్జేడీ అసంతృప్తి
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:33 AM
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం విభేదాలకు దారితీసింది. మొత్తం 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ 70 సీట్లలో
రాంచీ, అక్టోబరు 19: వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం విభేదాలకు దారితీసింది. మొత్తం 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేయనున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ శనివారం ప్రకటించారు. దీనిపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు, వామపక్షాలకు కలిపి 11 సీట్లు మాత్రమే ఇస్తారా? అంటూ మండిపడింది. 15 నుంచి 18 సీట్లలో తమకు గట్టి పట్టు ఉందని, అక్కడ బీజేపీని సొంతంగా ఓడిస్తామని పేర్కొంది. అయితే, ఆర్జేడీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. కూటమిలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆ పార్టీ నాయకుడు పవన్ ఖేరా స్పష్టం చేశారు. అన్ని పక్షాలతో సమగ్రంగా చర్చించాకే 70 సీట్లలో జేఎంఎం-కాంగ్రెస్ పోటీకి నిర్ణయించాయని కాంగ్రెస్ నాయకుడు గులామ్ అహ్మద్ మిర్ తెలిపారు. కాగా, ఝార్ఖండ్‌లో విపక్ష ఎన్డీఏ కూటమి నామినేషన్ల దాఖలు మొదలైన శుక్రవారమే సీట్ల పంపకం పూర్తిచేసింది. బీజేపీ 68, ఏజేఎ్‌సయూ 10, జేడీయూ 2, ఎల్జేపీ (రాంవిలాస్) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. బీజేపీ 66 మందితో కూడిన జాబితాను శనివారం రాత్రే ప్రకటించింది.