Share News

రాష్ట్రాలకు బియ్యం విక్రయాల పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:06 AM

రాష్ట్రాలకు సబ్సిడీ ధరపై బియ్యం విక్రయాలను నరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది.

రాష్ట్రాలకు బియ్యం విక్రయాల పునరుద్ధరణ

ప్రైవేటు వ్యాపారులకు కూడా.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 4: రాష్ట్రాలకు సబ్సిడీ ధరపై బియ్యం విక్రయాలనుపునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు కూడా విక్రయించనుంది. తాను భారీగా సేకరించిన బియ్యం నిల్వలను తగ్గించుకోవడం ఈ నిర్ణయం ముఖ్యోద్దేశం. సబ్సిడీపై బియ్యం విక్రయాలను కేంద్రం గత ఏడాది జూన్‌లో నిలిపివేయడంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. అయితే నిరుడు వర్షాలు సమృద్ధిగా పడనందున విక్రయాలు ఆపేశామని.. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పంటల దిగుబడి బాగా ఉండే అవకాశం ఉండడం.. ఇదే సమయంలో ఆహార నిల్వలు బాగా పెరిగిపోవడం.. వాటి నిర్వహణకు బాగా ఖర్చవుతుండడం.. నిల్వకు ఉన్న గోదాములు కూడా సరిపోకపోవడం తదితర కారణాలతో విక్రయాలు పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. నిర్వహణ ఖర్చుల భారం రూ.16-18 వేల కోట్లు అధికంగా ఉండబోతోందని.. ఈ నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనిని ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు. పెరిగిన బియ్యం నిల్వలు తగ్గించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సారథ్యంలోని అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీకి ఆహార శాఖ సిఫారసు చేసిందని.. దీంతో అమ్మకాల పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

Updated Date - Jul 05 , 2024 | 06:49 AM