Share News

ఎన్‌ఆర్‌ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:56 AM

భారత పౌరులు, ఎన్‌ఆర్‌ఐల మధ్య వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఎన్‌ఆర్‌ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

మోసాలను అరికట్టేందుకు సమగ్ర చట్టం ఉండాలి

కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్‌ సిఫారసులు

కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత పౌరులు, ఎన్‌ఆర్‌ఐల మధ్య వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తప్పుడు హామీలు, అసత్య సమాచారం, జీవిత భాగస్వామిని వదిలేయడం వంటి మోసాలను అరికట్టడానికి ఇటువంటి వివాహాలను తప్పనిసరిగా భారత్‌లోనే రిజిస్టర్‌ చేయాలని సిఫారసు చేసింది. ఇంకా అనేక కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదికను జస్టిస్‌ రుతురాజ్‌ అవస్తీ నేతృత్వంలోని లా కమిషన్‌ కేంద్ర న్యాయశాఖకు శుక్రవారం సమర్పించింది. ‘‘భారత పౌరులు, ఎన్‌ఆర్‌ఐల మధ్య జరుగుతున్న వివాహాలు మోసపూరితంగా మారి, భారతీయ జీవిత భాగస్వాములను ముఖ్యంగా మహిళలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టే ధోరణి పెరుగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐలు/ఓఐసీలు, భారత పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలను తప్పనిసరిగా భారత్‌లోనే రిజిస్టర్‌ చేయాలని సిఫారసు చేస్తున్నాం. విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఎన్‌ఆర్‌ఐలు/ఓఐసీలకు సమన్లు లేదా జ్యుడీషియల్‌ డాక్యుమెంట్లు అందించడం వంటి అంశాలకు సంబంధించి కొత్త చట్టంలో నిబంధనలు ఉండాలి’ అని సిఫారసు చేసింది. ఎన్‌ఆర్‌ఐల వైవాహిక స్థితిని ప్రకటించడం, దంపతుల పాస్‌పోర్ట్‌ను ఒకదానితో మరొకటి లింక్‌ చేయడం, వాటిపై వివాహ రిజిస్ట్రేషన్‌ నంబరు పేర్కొనడం తప్పనిసరి చేయడానికి గాను పాస్‌పోర్ట్‌ చట్టం-1967లో అవసరమైన సవరణలు చేయాలంది. ఇటువంటి వివాహాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి దేశీయ కోర్టులకు అధికారం ఉండాలని లా కమిషన్‌ పేర్కొంది.

Updated Date - Feb 17 , 2024 | 09:25 AM