Share News

మయన్మార్‌లో తిరుగుబాటు ఉధృతం

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:01 AM

మయన్మార్‌లోని సైనిక (జుంటా) ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ఉధృతమవుతోంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల సరిహద్దుల్లో ఉన్న రేవు పట్టణం పలేత్వాను తాము స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటు దళాల్లో

మయన్మార్‌లో తిరుగుబాటు ఉధృతం

భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న అరాకన్‌ ఆర్మీ

నెయ్‌పిడా, జనవరి 16: మయన్మార్‌లోని సైనిక (జుంటా) ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ఉధృతమవుతోంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల సరిహద్దుల్లో ఉన్న రేవు పట్టణం పలేత్వాను తాము స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటు దళాల్లో ఒకటైన అరాకన్‌ ఆర్మీ (ఏఏ) ప్రకటించింది. ఈ పట్టణం రాఖినే రాష్ట్రంలో కాలాదన్‌ నది పక్కన ఉంది. సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశాలపై పొరుగుదేశాలతో స్నేహపూర్వకంగా ఉంటామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఏఏ ప్రకటనపై స్పందించటానికి జుంటా ప్రభుత్వ ప్రతినిధి నిరాకరించారు. మయన్మార్‌లో త్రీ బ్రదర్‌హుడ్‌ అలయెన్స్‌ పేరిటమూడు సాయుధ సంస్థలు తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్నాయి. ఇప్పటికే పలు సైనిక పోస్టులను, పట్టణాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ సాయుధ గ్రూపులకు ప్రజాస్వామ్య అనుకూల ప్రత్యామ్నాయ ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. సాయుధ సంస్థల్లో ఒకటైన ఎమ్‌ఎన్‌డీఏఏ.. ఇటీవల చైనా సరిహద్దులో ఉన్న ఉత్తర షాన్‌ రాష్ట్రంలోని లావుక్కయ్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. చైనా సరిహద్దు ప్రాంతంలో అలయెన్స్‌తో కాల్పుల విరమణకు జుంటా ప్రభుత్వం గత వారం అంగీకరించింది. అయితే, ఈ ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉండటం లేదని, కాల్పుల విరమణను ఉల్లంఘించి పలు చోట్ల తమపై దాడులకు పాల్పడుతోందని అలయెన్స్‌ ఆరోపించింది.

Updated Date - Jan 17 , 2024 | 06:31 AM