ప్రభుత్వ ఉద్యోగానికి సంతాన పరిమితి నిబంధన సబబే: సుప్రీం
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:50 AM
ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు విధించిన అర్హతల్లో సంతాన పరిమితిని పేర్కొనడం సబబేనని, అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు కన్నా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు విధించిన అర్హతల్లో సంతాన పరిమితిని పేర్కొనడం సబబేనని, అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు కారంటూ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను సమర్థించింది. ఈ మేరకు గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజస్థాన్ వేరియస్ సర్వీస్ అమెండ్‌మెంట్ రూల్స్-2001లో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనర్హులన్న నిబంధన ఉంది. రాజస్థాన్ పోలీసు సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1989లోని రూల్ నెంబరు 24(4)లో కూడా 2002 జూన్ ఒకటో తేదీ తరువాత ఇద్దరు కన్నా ఎక్కు వ మంది పిల్లలు కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు కారని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలను సవాలు చేస్తూ రామ్‌జీ లాల్ జాట్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. 2017లో మిలటరీ నుంచి రిటైరయిన ఆయన 2018లో పోలీసు కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేశారు. అధిక సంతా నం కలిగి ఉన్నారన్న కారణంతో ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నిబంధనలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈ నిబంధనలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేవే తప్ప వివక్ష చూపేవి కాదని తెలిపింది. అప్పీలును తిరస్కరించింది.