Share News

కోలాల కొట్లాటతో తగ్గుతున్న రేట్లు!

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:26 AM

తక్కువ ధరలతో మార్కెట్లోకి ఒకేసారి పెద్ద ఎత్తున కమ్ముకొచ్చేయడం.. అప్పటికే ఆ రంగంలో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీల మార్కెట్‌ షేర్‌ను కొల్లగొట్టి, బలంగా జెండా పాతేయడం.. ఇదీ రిలయన్స్‌ కంపెనీకి బాగా అలవాటైన, ఎప్పుడూ పాటించే వ్యూహం. నిరుడు క్యాంప

కోలాల కొట్లాటతో తగ్గుతున్న రేట్లు!

క్యాంప కోలా ధరలయుద్ధంతో ఆలోచనలో పడ్డ పెప్సీ, కోక్‌

15-20 శాతం తక్కువ ధరతో కొత్త డ్రింకులు తెచ్చే యోచన?

న్యూఢిల్లీ, అక్టోబరు 24: తక్కువ ధరలతో మార్కెట్లోకి ఒకేసారి పెద్ద ఎత్తున కమ్ముకొచ్చేయడం.. అప్పటికే ఆ రంగంలో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీల మార్కెట్‌ షేర్‌ను కొల్లగొట్టి, బలంగా జెండా పాతేయడం.. ఇదీ రిలయన్స్‌ కంపెనీకి బాగా అలవాటైన, ఎప్పుడూ పాటించే వ్యూహం. నిరుడు క్యాంప కోలా అనేపేరుతో శీతల పానీయాల మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌.. తనదైన శైలిలో తక్కువ ధరలతో ఆకట్టుకుని మార్కెట్లో గట్టి పట్టే సాధించింది. దీంతో.. ప్రత్యర్థి కంపెనీలైన కోక్‌, పెప్సీ ఆలోచనలో పడ్డాయి! ప్రస్తుతం తాము విక్రయిస్తున్న శీతలపానీయాల కంటే 15-20 తక్కువ ధరలతో కొత్త డ్రింకులను మార్కెట్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 2022లో క్యాంప కోలాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ తొలి నుంచే ధరల యుద్ధానికి తెరతీసింది. పెప్సీ, కోక్‌ 250మిల్లీలీటర్ల పెట్‌ బాటిల్స్‌ను 20 రూపాయలకు విక్రయిస్తుంటే.. 200 మిల్లీలీటర్ల క్యాంప కోలా పెట్‌ బాటిల్‌ను రూ.10కే విక్రయించింది! పెప్సీ, కోక్‌ 300 మిల్లీలీటర్ల టిన్‌ ధర రూ.30 అయితే.. 200మిల్లీలీటర్ల క్యాంప కోలా టిన్‌ను రూ.20కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యర్థి కంపెనీలు 3.5 నుంచి 5ు మార్జిన్‌ ఇస్తుంటే.. రిలయన్స్‌ 6 నుంచి 8ు మార్జిన్‌ ఇచ్చింది. మొదట్లో రిలయన్స్‌ను పట్టించుకోని ప్రత్యర్థి కంపెనీలు ఇప్పుడు అప్రమత్తమై.. క్యాంప కోలాకు పోటీగా కొత్త ‘బడ్జెట్‌ ఫ్రెండ్లీ’ శీతలపానీయాలను తెచ్చే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కోకాకోలా ఇప్పటికే ద్వితీయ శ్రేణి నగరాల్లో.. పది రూపాయల కోక్‌ సీసాల పంపిణీని విస్తృతం చేసింది.

Updated Date - Oct 25 , 2024 | 01:26 AM