Share News

Rahul Gandhi: అస్సాంలో రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. ధర్నాకు దిగిన అగ్రనేత

ABN , Publish Date - Jan 22 , 2024 | 03:20 PM

తన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు గాను రాహుల్‌ని అధికారులు అనుమతించలేదు.

Rahul Gandhi: అస్సాంలో రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. ధర్నాకు దిగిన అగ్రనేత

తన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు గాను రాహుల్‌ని అధికారులు అనుమతించలేదు. రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ.. తనని అడ్డుకోవడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అటు.. మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.


‘‘మేము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నాం. కానీ.. మమ్మల్ని అడ్డుకున్నారు. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేం చేశాను?’’ అని రాహుల్ గాంధీ తారాస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది కూడా ప్రధాని మోదీ నిర్ణయిస్తారా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తాము కేవలం ప్రార్థన చేసుకోవడానికే ఈ ఆలయానికి వచ్చామని, ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. శంకరదేవ జన్మస్థలానికి వెళ్లేందుకు తనకు అనుమతి లేదు కానీ.. శాంతిభ్రదతల సంక్షోభ సమయంలో మాత్రం ఇతరులు వెళ్లొచ్చా? అని ఆయన నిలదీశారు. అటు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగారు. స్థానిక అధికారుల చర్యను తప్పుబడుతూ.. మనమంతా ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామని, కానీ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఇవ్వకుండా స్థానిక ఎంపీ గౌరవ్ గొగోయ్‌ను కూడా ఆపుతున్నారని, ఇది అన్యాయమని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో.. ఆలయంలో ప్రార్థనలు చేసుకోకుండా రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అవమానకరమైన పరిస్థితిగా అభివర్ణించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎప్పుడు, ఎక్కడ ప్రార్థనలు చేయవచ్చో ప్రభుత్వం నిర్దేశిస్తోందని.. ఈ విషయంలో ప్రజాస్వామ్యం లేదని దేశాయ్ పేర్కొన్నారు. ఇదిలావుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయ దర్శనానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనా.. అంతకుముందు ఆయన్ను అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరాధన స్వేచ్ఛ, మతపరమైన ఆచారాలను నిర్దేశించడంలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చకు దారితీసింది.

Updated Date - Jan 22 , 2024 | 03:26 PM