Share News

Budget: మరో రెండు రోజుల్లో మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్.. ఈసారి ఎలా ఉండబోతుందంటే..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:01 AM

ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్‌ పెట్టడానికి మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టబోతోంది. లెక్క ప్రకారమైతే తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలకు తావుండకూడదు. కానీ.. ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కలను దృష్టిలో

Budget: మరో రెండు రోజుల్లో మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్.. ఈసారి ఎలా ఉండబోతుందంటే..?

ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా?

పార్లమెంటులో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్‌ను

ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

ఎన్డీయే-2 హయాంలో చివరి బడ్జెట్‌ ఇదే

ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షక నిర్ణయాలపై ఆశలు

సెక్షన్‌ 80సి కింద ఇచ్చే మినహాయింపుల్ని

లక్షన్నర నుంచి 2.5 లక్షలకు పెంచాలని వినతి

ఈవీలకు ఊతమిచ్చే ఫేమ్‌-3 ప్రకటించే అవకాశం

రైతులకు ‘పీఎం కిసాన్‌’ మొత్తాన్ని పెంచే చాన్స్‌

హైదరాబాద్‌, జనవరి 29: ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్‌ పెట్టడానికి మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టబోతోంది. లెక్క ప్రకారమైతే తాత్కాలిక బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలకు తావుండకూడదు. కానీ.. ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే లెక్క (బడ్జెట్‌) కాబట్టి ప్రభుత్వాలు తాత్కాలిక బడ్జెట్లలోనూ తాయిలాలు గుప్పించడం ఆనవాయితీగా మారి చాలాకాలమే అయింది. ఈ నేపథ్యంలోనే.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఇంటెరిమ్‌ బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజలను మరీ ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందన్న ఆశ సగటు మధ్యతరగతి జీవుల్లో, పేదల్లో ఉంది.

సాధారణంగా బడ్జెట్‌ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది.. ఆదాయ పన్ను శ్లాబులే! ఈసారైనా కేంద్రం దయతలచి పన్ను పరిమితిని పెంచితే బాగుండని కోరుకోవడం.. తీరా బడ్జెట్‌ చూశాక ఉసూరంటూ నిరాశకు గురి కావడం ఎప్పుడూ జరిగేదే. అయినా మళ్లీ కొత్త బడ్జెట్‌ ప్రకటిస్తున్నారనగానే ఆశలు చిగురించడమూ అంతే సహజం. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపన్నుకు సంబంధించి ప్రస్తుతం పాత, కొత్త విధానాలు అమల్లో ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికీ కనీస మినహాయింపు పరిమితి ఒక్కో విధంగా ఉంది. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ.2.5 లక్షలుగా ఉండగా.. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలుగా ఉంది. ఈ రెండు పరిమితులనూ పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం పెంచుతుందని ఆశపడుతున్నారు.

ప్రామాణిక తగ్గింపు పరిమితి (స్టాండర్డ్‌ డిడక్షన్‌ లిమిట్‌)ని ప్రస్తుతం ఉన్న 50 వేల నుంచి రూ.లక్షకు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు.. హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు, ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గింపు పరిమితిని కూడా కేంద్రం పెంచుతుందని ఆశిస్తున్నారు.

జాతీయ పింఛను పథకం పరిమితిని కూడా పాత, కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ రూ.లక్షకు పెంచే అవకాశం ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చాలా మంది ఇప్పటికీ పాత పన్ను విధానంలోనే ఉన్నారని.. రెండింటిలోనూ ఈ పరిమితిని పెంచితే చాలా మంది కొత్త పన్ను విధానం వైపు మారే అవకాశం ఉందని టాటా పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో కురియన్‌ జోస్‌ అభిప్రాయపడ్డారు.

గృహరుణ కిస్తీల కింద నెలనెలా వేలాది రూపాయలు చెల్లించే వేతన జీవులు చాలామంది కొత్త పన్ను విధానం వైపు మొగ్గుచూపకపోవడానికి కారణం గృహ రుణ వడ్డీల మినహాయింపులే. ఈ నేపథ్యంలో.. ఆ మినహాయింపును కొత్త పన్ను విధానానికీ వర్తింపజేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసే క్రమంలో.. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌)’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫేమ్‌-1, ఫేమ్‌-2 పేరిట రెండు దఫాలుగా ఈ పథకం కింద ఈవీల కొనుగోళ్లపై ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఫేమ్‌-2 కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో ఫేమ్‌-3ని ప్రకటించనున్నట్టు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ ఇటీవలే వెల్లడించింది.

జీవితబీమా ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తే బీమా తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందని ఆ రంగానికి చెందిన నిపుణులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆ దిశగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు అంచనా.

  • ,,ఇవే కాదు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉత్పత్తి రంగాలకు సంబంధించి కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా పలు కీలక నిర్ణయాలను ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • పన్ను మినహాయింపుల్లో చాలా మంది కోరేది.. సెక్షన్‌ 80సీ కింద ఇస్తున్న మినహాయింపు పరిమితి పెంపు. రూ.లక్షగా ఉన్న ఈ పరిమితిని.. 2014-15 బడ్జెట్‌లో రూ.1.5 లక్షలకు పెంచారు. అప్పట్నుంచీ ఈ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. కనీసం ఈసారైనా ఈ పరిమితిని రూ.2 లక్షలకు ప్రభుత్వం పెంచుతుందన్న ఆశాభావం వేతనజీవుల్లో వ్యక్తమవుతోంది. తొమ్మిదేళ్లుగా పెరిగిన ధరలను, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచాలని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ సురభి మార్వా అభిప్రాయపడ్డారు.

  • వేతన జీవులే కాదు.. ఎన్నికల ఏడాది బడ్జెట్‌లో రైతన్నలకూ పెద్ద పీట వేయడం ప్రభుత్వాలకు అలవాటే. ఈ క్రమంలోనే, 2019లో ఎన్నికలకు ముందు ఆర్థికమంతిగ్రా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పీయూష్‌ గోయల్‌.. రైతుల కోసం ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే కోవలో ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆకట్టుకునేలా ఈ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచుతూ ప్రకటన చేసే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 06:47 AM