Share News

Priyanka Gandhi : అమాయకుల మీదికే బుల్డోజర్లు

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:47 AM

యూపీలో అమాయకుల ఇళ్లను కూల్చేస్తున్న బుల్డోజర్లు నేరస్థుల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. పేపర్‌ లీకేజీకి పాల్పడిన, మహిళలను హింసించిన,

Priyanka Gandhi : అమాయకుల మీదికే బుల్డోజర్లు

యూపీ సర్కార్‌పై ప్రియాంక ధ్వజం.. రాహుల్‌తో కలిసి యాత్ర

లఖ్‌నవూ, ఫిబ్రవరి 24: యూపీలో అమాయకుల ఇళ్లను కూల్చేస్తున్న బుల్డోజర్లు నేరస్థుల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. పేపర్‌ లీకేజీకి పాల్పడిన, మహిళలను హింసించిన, రైతులను జీపులతో తొక్కి చంపిన నేరస్థుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం లేదంటూ యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర రెండ్రోజుల విరామం అనంతరం యూపీలోని మొరాదాబాద్‌లో శనివారం తిరిగి ప్రారంభమైంది. రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొన్న ప్రియాంక మొరాదాబాద్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉండగా, సోమవారం ఆగ్రాలో జరిగే యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొంటారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించేందుకు రాహుల్‌ గాంధీ యూకే పర్యటనకు వెళుతుండడంతో ఫిబ్రవరి26 నుంచి మార్చి 1 దాకా జోడో న్యాయ్‌ యాత్రకు విరామం ప్రకటించారు. మార్చి 2న ధోల్‌పూర్‌ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

యూపీలో మళ్లీ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష

ప్రశ్నాపత్రాలు లీకైన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ యూపీ యువత నిర్వహిస్తున్న ఉద్యమానికి యోగి సర్కారు దిగి వచ్చింది. ఆరు నెలల్లో పరీక్షను తిరిగి నిర్వహిస్తామని, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్తామని శనివారం ప్రకటించింది.

Updated Date - Feb 25 , 2024 | 05:47 AM