Share News

అణు యుద్ధానికి సిద్ధం!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:29 AM

అణు యుద్ధానికి సాంకేతికంగా సిద్ధం గా ఉన్నామని, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన సైన్యా న్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు.

అణు యుద్ధానికి సిద్ధం!

కానీ..తొందరపడడం లేదు : పుతిన్‌

ఉక్రెయిన్‌ మద్దతుగా అమెరికా సైన్యాన్ని మోహరిస్తే అణు యుద్ధం తప్పదు

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని వెల్లడి

మాస్కో, మార్చి13: అణు యుద్ధానికి సాంకేతికంగా సిద్ధం గా ఉన్నామని, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన సైన్యా న్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. ఈ నెల 15-17 మధ్య రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పుతిన్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రష్యా ప్రజలు తనకు మరో ఆరేళ్ల పదవీకాలం కట్టబెట్టడం ఖాయమన్నారు. అణు యుద్ధానికి రష్యా సాంకేతికంగా సిద్ధంగానే ఉంద ని, అయితే.. దానికోసం తాము తొందరపడడంలేదన్నారు. ఉక్రెయిన్‌పై అణ్యాయుధాలను ప్రయోగించాల్సిన అవసరం తమకు కనిపించడంలేదని చెప్పారు. ‘ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన బలగాలను మోహరిస్తే ఈ చర్య ను నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకున్నట్టు భావించి తీవ్రం గా పరిగణిస్తాం. దానికి తప్పక బదలిస్తాం. ప్రతి అంశం అణు యుద్ధం దిశగా పరుగులు తీస్తుందని నేను భావించడం లేదు. ఆ పరిస్థితి వస్తే మాత్రం మేం సిద్ధంగానే ఉన్నాం’ అని పుతిన్‌ అన్నారు. 2022 ఫిబ్రవరిలో రష్యా సైనికులను ఉక్రెయిన్‌లోకి పంపి న పుతిన్‌ ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి తెరలేపారు. దీనిలో అమెరికా, ఐరోపా దేశాలు జోక్యం చేసుకుంటే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలను కూడా వాడాల్సి వస్తుందని పుతిన్‌ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారు. కాగా, ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగానే ఉందని పుతిన్‌ చెప్పారు. ఒకవేళ అమెరికా అణు పరీక్ష లు నిర్వహిస్తే.. రష్యా అదే పనిచేస్తుందని హెచ్చరించారు.

అణ్వాయుధ సూపర్‌ పవర్‌

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వ కలిగిన దేశం. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ (ఎఫ్‌ఏఎస్‌) నివేదిక ప్రకారం రష్యా వద్ద 5,580 అణ్వాయుధాలున్నాయి. వాటిలో 1,200 ఆయుధాలకు కాలం చెల్లినా మరో 4,380 ఆయుధాలను దీర్ఘకాలిక లాంచర్లు, స్వల్ప శ్రేణి వ్యూహాత్మక లాంచర్ల కోసం నిల్వ చేసి ఉంచారని ఎఫ్‌ఏఎస్‌ పేర్కొంది. రష్యా తన వద్ద ఉన్న వాటిలో ఇప్పటికే 1,710 వ్యూహాత్మక వార్‌హెడ్‌లను వివిధ ప్రాంతాల్లో మోహరించింది. సోవియట్‌ యూనియన్‌ పతనం అనంతరం రష్యా ఇంతవరకూ అణు పరీక్షలు నిర్వహించలేదు. కాగా రష్యా పేర్కొన్న 2020 అణు సిద్ధాంతం.. రష్యా అధ్యక్షుడు అణ్వాయుధాన్ని ఉపయోగించడాన్ని పరిగణించే పరిస్థితులను నిర్దేశిస్తుంది. దీని ప్రకారం శత్రు దేశాలు అణ్వాయుధాలు లేదా ఇతర మారణాయుధాలను ఉపయోగించి చేసే దాడులకు ప్రతిస్పందనగా అణు దాడికి దిగవచ్చు. లేదా దేశ ఉనికికే ముప్పు వాటిల్లినప్పుడు రష్యా అధ్యక్షుడు అణు దాడికి ఆదేశించవచ్చు.

Updated Date - Mar 14 , 2024 | 04:29 AM