WB : పేదరిక భారతం!
ABN , Publish Date - Oct 17 , 2024 | 06:52 AM
దేశాన్ని పేదరికం వెంటాడుతూనే ఉంది. తాజాగా 2024- ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో 12.9 కోట్ల మంది ప్రజలు దుర్భర పేదరికంలోనే బతుకీడుస్తున్నారు. వీరి
దుర్భర పేదరికంలో 12.9 కోట్ల మంది
ప్రపంచ బ్యాంకు నివేదిక
న్యూఢిల్లీ, అక్టోబరు 16: దేశాన్ని పేదరికం వెంటాడుతూనే ఉంది. తాజాగా 2024- ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో 12.9 కోట్ల మంది ప్రజలు దుర్భర పేదరికంలోనే బతుకీడుస్తున్నారు. వీరి ఆదాయం రోజుకు రూ.181 కన్నా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అయితే, 1990లో 43.1 కోట్ల మంది పేదలు ఉండగా వీరి సంఖ్య తగ్గుతూ వచ్చిందని తెలిపింది. 2021 నాటికి 3.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. మధ్యస్త ఆదాయ దేశాల్లో రోజుకు రూ.576 సంపాయించేవారిని పేదలుగా పరిగణిస్తూ రూపొందించిన ఈ నివేదికలో భారతదేశ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. రోజుకు రూ.576 సంపాయించే వారిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 1990ల కన్నా భారత్‌లో పేదరికం దారుణంగా ఉందని పేర్కొంది. దీనికి కారణం జనాభా పెరుగుదలేనని వివరించింది. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన గృహ వినియోగం, వ్యయ సర్వేలో ఈ వివరాలను వెల్లడించలేదని పేర్కొంది. కాగా, ఆఫ్రికా సహా పలు దేశాల్లో 2030 నాటికి దుర్భర పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే.. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమని నివేదిక వెల్లడించింది. పేదరిక నిర్మూలనా చర్యలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందగమనంలో ఉన్నాయని ఆక్షేపించింది. ఈ పరిస్థితి ఇలానే సాగితే మరికొన్ని శతాబ్దాలు పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ప్రపంచ పేదరికంలో భారత్ వాటా మాత్రం కొన్ని దశాబ్దాలలోనే తగ్గే అవకాశం ఉందని, దీనికి కారణం జీడీపీ వృద్ధి పెరుగుతోందని వివరించింది.