Share News

న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:36 AM

: న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర జరుగుతున్నదని పలువురు న్యాయవాదులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై

న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర

కోర్టులపై విశ్వసాన్ని తగ్గించేలా అసత్య ప్రచారం.. న్యాయస్థానాల ప్రతిష్ఠకు భంగం కలిగే ప్రమాదం

సీజేఐకు 600 మంది సుప్రీంకోర్టు న్యాయవాదుల లేఖ

న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర జరుగుతున్నదని పలువురు న్యాయవాదులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సుమారు 600 మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఈనెల 26వ తేదీన రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజకీయ లక్ష్యాలతో కొన్ని ప్ర త్యేక బృందాలు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్ర యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి రాజకీయ నేతల ఆర్థిక సంబంధాలకు సంబంధించిన కేసుల్లో పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ‘‘రాజకీయ ప్రముఖులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారికి చెందిన కేసుల్లో నిందితులు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. రాజకీయ నేతలు కొందరిపై అవినీతి ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ వారే కోర్టుల్లో వాటిని సమర్థించుకుంటారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును కించపరిచేలా స్వర్ణయుగం, బెంచ్‌ ఫిక్సింగ్‌ వంటి పదాలను కొందరు వ్యంగ్యంగా వినియోగిస్తున్నారు. న్యాయస్థానాలను అగౌరవ పరిచే ఇలాంటి పదజాలాన్ని ప్రయోగించే వారిని ఉపేక్షించకూడదు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొ ట్టాలి. దీనిపై మౌనంగా ఉంటే న్యాయవ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనినే అలుసుగా తీ సుకుని వారు మరింత పెట్రేగిపోయే అవకాశముంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలోనే ఇలాంటివి ఉత్పన్నం అవుతున్నాయి. 2018-19 ఎన్నికల సమయంలోనూ ఇలాగే జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే ప్ర యత్నం జరుగుతోంది. వీటిని ఉపేక్షించడం మంచిది కాదు. అందుకే.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతున్నాం’’ అని లేఖలో పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో హరీశ్‌ సాల్వే, మనన్‌ కుమార్‌ మిశ్రా, అదిష్‌ అగర్వాల, చేత న్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

ఇది పాతకాలపు కాంగ్రెస్‌ సంస్కృతి: మోదీ

సీజేఐకి న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, వేధించడం పాత కాలపు కాంగ్రెస్‌ సంస్కృతి అని ఎక్స్‌ వేదికగా మోదీ ఆరోపించారు. ఐదు దశాబ్దాల క్రితమే కమిటెడ్‌ జ్యుడీషియరీ కోసం కాంగ్రెస్‌ పిలుపునిచ్చిందన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధంగా ఉంటారన్నారు. ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గు లేకుం డా కోరతారని, దేశం పట్ల నిబద్థతకు మాత్రం దూరంగా ఉంటారని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని తిరస్కరించడంలో ఆశ్చర్యమేమీ లేదని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ వ్యాఖ్యలు కపటత్వానికి పరాకాష్ఠ: ఖర్గే

ప్రధాని మోదీ వ్యాఖ్యలు కపటత్వానికి పరాకాష్ఠ అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యా న్ని ఏమార్చారని ఆరోపించింది. ప్రధాని దేశంలోని ప్రతీ వ్యవస్థ పైనా బలప్రయోగానికి పాల్పడ్డారని, రాజ్యాంగాన్ని దెబ్బ తీశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని వ్యాఖ్యానించిన విషయం ప్రధాని గుర్తు చేసుకోవాలన్నారు. అది మోదీ ప్రధానిగా ఉన్నపుడే జరిగిందని చెప్పారు. అందులో ఒక న్యాయమూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారని ప్రస్తావించారు.

Updated Date - Mar 29 , 2024 | 06:43 AM