Share News

పంతం నీదా.. నాదా!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:45 AM

ఓవైపు భావోద్వేగం.. మరోవైపు భావజాలం..! అటు అభివృద్ధి వాదం.. ఇటు అసమానతలపై నిరసన నినాదం..!

పంతం నీదా.. నాదా!

లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గ్యారెంటీ ్ఠ రాహుల్‌ న్యాయ్‌ గ్యారెంటీలు

న్యూఢిల్లీ, మార్చి 17: ఓవైపు భావోద్వేగం.. మరోవైపు భావజాలం..! అటు అభివృద్ధి వాదం.. ఇటు అసమానతలపై నిరసన నినాదం..! పాతికేళ్ల ప్రగతి ప్రయాణానికి ఒకరి పిలుపు..! పదేళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ ప్రత్యర్థి ప్రశ్నలు..! వెరసి వచ్చే లోక్‌సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ‘మోదీ గ్యారంటీ’లను అగ్రనేత రాహుల్‌ గాంధీ న్యాయ్‌ గ్యారెంటీలతో కాంగ్రెస్‌ ఢీకొట్టనుంది. రాబోయే సార్వత్రిక సమరాంగణంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారే పది కీలక అంశాలివే..

మోదీ గ్యారెంటీలు: మూడోసారీ మాదే అధికారం అంటూ అంతులేని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రధాని మోదీ.. ‘మోదీ గ్యారంటీ’ని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. యువతకు మంచి భవిష్యత్‌, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తాము చేసిన కృషిని వివరిస్తూ ఓట్లడిగే వీలుంది.

కాంగ్రెస్‌ న్యాయ్‌ గ్యారెంటీలు: తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ‘గ్యారెంటీలు’ అంటూ ప్రజల్లోకి వెళ్లి విజయవంతమైన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికలకూ ఇదే విధనంగా ‘ఐదు న్యాయ్‌ గ్యారెంటీలను’ ప్రకటించింది. యువత, రైతులు, మహిళలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించింది. మణిపూర్‌ నుంచి ముంబైకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్‌ వీటి గురించి చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని, వీటిచుట్టూనే ప్రచారం జరిగేలా చూస్తుందని అంచనా.

నిరుద్యోగం, ధరలు: నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగితను విపక్ష ఇండియా కూటమి గట్టిగా లేవనెత్తుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన లేకపోవడంపై మోదీ ప్రభుత్వాన్ని కడిగేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగావకాశాల వృద్ధి గురించి చెబుతూ బీజేపీ దీనికి అడ్డుకట్ట వేస్తోంది.

ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ, యూసీసీ: బీజేపీ సుదీర్ఘకాల నినాదాలివి. మోదీ రెండోసారి గెలిచిన వెంటనే.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్‌ 370ని రద్దు చేశారు. పాలన చివర్లో ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృ అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘మేం చెప్పింది చేశామంటూ’.. కాషాయ పార్టీ చెప్పుకొనేందుకు అవకాశం ఉంది. విపక్షాలు మాత్రం ఈ ప్రయత్నాలను.. సమాజాన్ని వర్గాలు చీల్చేవిగా మండిపడుతున్నాయి.

అయోధ్య రామ మందిరం: ఉత్తరాదిన ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం అయోధ్యలో రామ మందిర నిర్మాణం. విపక్షాల నేతలు కూడా రామ మందిర నిర్మాణం ఉత్తరాదిన బీజేపీకి మైలేజీ ఇచ్చిందని అంగీకరిస్తున్నారు. ‘మాకు 370 సీట్లు ఖాయం’ అంటూ బీజేపీ ఢంకా బజాయించి చెప్పడానికి వెనుక ఉన్న కారణమిదే.

అమృత్‌ కాల్‌ వర్సెస్‌ అన్యాయ్‌ కాల్‌: సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్‌పై దార్శనికతను మోదీ పాలనలో సాధించిన విజయాలుగా బీజేపీ చెప్పుకొనే వీలుంటే.. రాజ్యాంగం మీద దాడి, ఆర్థిక అసమానతల సంగతేమంటూ విపక్ష కూటమి ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ పదేళ్ల పాలనను అన్యాయ కాలమని కాంగ్రెస్‌ ఆరోపిస్తే, రాబోయే 25ఏళ్లు అమృతకాలమని దేశాభివృద్ధికి బాటలు వేయాలని బీజేపీ ప్రచారం చేసుకోనుంది.

రైతులు.. మద్దతు ధర: మోదీ రెండో దఫా పాలనలో రెండుసార్లు రైతులు రోడ్డెక్కారు. మూడు సాగు చట్టాలకు వ్యతికేరంగా నెలల తరబడి ఢిల్లీ శివారులో ఉంటూ ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు కూడా చలో ఢిల్లీ అంటున్నారు. పీఎం కిసాన్‌ పథకం రైతులకు చేకూర్చిన మేలును బీజేపీ గుర్తుచేస్తోంది.

సిద్ధాంతాల సమరం: బీజేపీవి మతతత్వ విధానాలని.. సమాజాన్ని చీల్చే ప్రయత్నాలని ఉదాహరణలను చూపుతూ కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ధ్వజమెత్తే వీలుంది. ప్రతిగా కాంగ్రె్‌సవి బుజ్జగింపు రాజకీయాలని, కుటుంబ పార్టీ పాలన అని, అవినీతికి మారుపేరంటూ బీజేపీ విరుచుకుపడనుంది.

వికసిత్‌ భారత్‌.. మరో జుమ్లా: అభివృద్ధి చెందిన దేశంగా(వికసిత భారత్‌) తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ చెబుతున్నారు. వందేళ్ల స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొనే 2047కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అంటున్నారు. అయితే, మోదీ విదేశాల నుంచి నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడంలాగే ఇది మరో అబద్ధం (జుమ్లా) అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎలక్టోరల్‌ బాండ్లు ప్రతిపక్షానికి ఆయుధం

సరిగ్గా ఎన్నికల ముంగిట సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బయటపడడం.. అందులో బీజేపీకి అత్యధిక విరాళాలు అందినట్లు తేలడం ప్రతిపక్షాలకు ఓ ఆయుధమే. బాండ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగింది.. బీజేపీ ఖాతాలను స్తంభింపజేయాలని, సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఇప్పటికే కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - Mar 18 , 2024 | 03:45 AM