Share News

ఒకే దేశం.. ఒకే నాయకుడు.. ప్రజలను అవమానించడమే!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:38 AM

భారతదేశం బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందినది ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలంతో వలసపాలన సాగించడానికి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు, ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ తదితర బీజేపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశానికి ఒకే

ఒకే దేశం.. ఒకే నాయకుడు.. ప్రజలను అవమానించడమే!

స్వాతంత్య్రం వచ్చింది ఆరెస్సెస్‌

వలసపాలనకు కాదు

బీజేపీ మేనిఫెస్టోలో పేదల కోసం ఏమీ లేదు: రాహుల్‌గాంధీ

వయనాడ్‌లో భారీ రోడ్‌ షో

రాహుల్‌ హెలికాప్టర్‌లో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

చెన్నై, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): భారతదేశం బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందినది ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలంతో వలసపాలన సాగించడానికి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు, ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ తదితర బీజేపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే బీజేపీ నేతల ఆలోచన ప్రతి భారతీయ యువకుడినీ అవమానించడమేనన్నారు. దేశానికి ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ఎందుకు ఉండకూడదని రాహుల్‌ ప్రశ్నించారు. దేశంలోని ప్రజలందరూ కలసి దేశాన్ని పరిపాలించాలని తాము కోరుతున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదేనన్నారు. దేశ ప్రజల అభిప్రాయాలను కాంగ్రెస్‌ వినాలనుకుంటుందని, వారి సంస్కృతి, మతం, భాష, విశ్వాసాలను కాంగ్రెస్‌ గౌరవిస్తుందని, అయితే, బీజేపీ అధిష్ఠానం మాత్రం తాము చెప్పిందే దేశమంతా అమలవ్వాలనుకుంటోందని విమర్శించారు. కేరళలోని తాను పోటీ చేస్తున్న వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్‌ టాప్‌ కారుపై కూర్చొని భారీ రోడ్‌షో జరిపారు. అంతకుముందు హెలికాప్టర్‌లో ఆయన తమిళనాడులోని నీలగిరి జిల్లా పందలూరుకు చేరుకున్నారు. అక్కడ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, రోడ్డు మార్గంలో వయనాడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి, మోదీకి కేవలం ఒకే దేశం..ఒకే భాష.. ఒకే నాయకుడు కనిపిస్తున్నాయని, ఇది మన దేశ మూల స్వరూపాన్ని అర్థంచేసుకోలేకపోవడమేనని విమర్శించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేదల కోసం ఏమీ లేదని విమర్శించారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనే ఎజెండాను దేశంపై రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ‘పేదల కోసం బీజేపీ విధానాలు ఏమిటి’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల కోసం విధానాలు ఉన్నాయని చెప్పారు. కానీ, బీజేపీ మేనిఫెస్టోలో 2036లో ఒలింపిక్స్‌ నిర్వహణ గురించి ప్రస్తావించారని, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య వ్యత్యాసం ఇదేనని రాహుల్‌ తెలిపారు. వివిధ రాష్ట్రాలు, వివిధ భాషల సమాహారంగా ఉన్న భారతదేశాన్ని రంగురంగుల పుష్పగుచ్ఛంతో ఆయన పోల్చారు. హిందీ కంటే మలయాళం తక్కువ అని అనడం కేరళ ప్రజలనే అవమానించినట్లన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయనాడ్‌పై సవతి తల్లిలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ..

తమిళనాడులోని నీలగిరి జిల్లా పందలూరులో రాహుల్‌గాంధీ హెలిక్యాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీ చేశారు. సోమవారం ఉదయం పందలూరులో హెలిపాడ్‌ వద్ద రాహుల్‌ హెలికాప్టర్‌ దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు హెలికాప్టర్‌ను చుట్టిముట్టి తనిఖీలు జరిపారు. తనిఖీలకు సహకరించిన రాహుల్‌.. పక్కనే ఉన్న తేయాకు కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించారు.

Updated Date - Apr 16 , 2024 | 03:38 AM