Share News

ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్‌ వేయడమా ?

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:39 AM

సందేశ్‌ఖాలీ కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వైఖరిని సోమవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ప్రైవేటు వ్యక్తుల పక్షాన  ప్రభుత్వం పిటిషన్‌ వేయడమా ?

  • నిందితునికి లేని బాధ సర్కారుకు ఎందుకు?

  • సందేశ్‌ఖాలీ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: సందేశ్‌ఖాలీ కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వైఖరిని సోమవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఓ పిటిషన్‌దారుగా ఇక్కడికి రావాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది.

సందేశ్‌ఖాళీలో కొందరు మహిళలపై నేరాలకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారంటూ వచ్చిన పిర్యాదులపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ ఈ నెల పదో తేదీన కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీన్ని పరిశీలించిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సం దీప్‌ మెహతాల ధర్మాసనం.. ఈవిషయంలో ప్రభుత్వం పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

ఇందుకు పశ్చిమ బెంగాల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి సమాధానం ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలుండటంతో పిటిషన్‌ వేయాల్సి వచ్చిందని చెప్పారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే వాటిని తొలగించాలని హైకోర్టునే ఆశ్రయించి ఉంటే సరిపోయేది కదా అని ప్రశ్నించింది. తొలుత సింఘ్వి వాదనలు ప్రారంభిస్తూ ఈ పిటిషన్‌ను 2 వారాల తర్వాత విచారణకు చేపట్టాలని కోరారు. ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలపై ప్రభుత్వం సవాలు చేయాలనుకుంటోందని చెప్పారు.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కల్పించుకొని కేసు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఇతరత్రా వినియోగించుకోకుండా ఆదేశించాలనికోరారు.

ధర్మా సనం స్పందిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు అమలుకాలేదని ఒకవేళ అవతలి పక్షం వారు కోర్టు ధిక్కరణ పిటిషన్‌వేస్తే.. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని హైకోర్టుకు చెప్పమని సింఘ్వికి సూచించింది. దీనిపై ఆయన జవాబు ఇస్తూ తాను 2వారాల తర్వాత విచారణ చేపట్టాలని కోరుతున్నానన్నారు.

ధర్మాసనం స్పందిస్తూ ‘‘భూ ఆక్రమణలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపైనే దర్యాప్తు జరపాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది కదా’’ అని గుర్తు చేసింది. ఇందుకు సింఘ్వి జవాబిస్తూ దీనిపైనే చెప్పాల్సింది చాలా ఉందన్నారు.

ధర్మాసనం జవాబిస్తూ ‘‘మీ కోరిక మేరకే కేసును వాయిదా వేస్తు న్నాం. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్న కారణం చూపి హైకోర్టులో కేసు విచారణను సాగదీయకూడదు’’అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం కోసం తరువాత పేజీ ని చదవండి


కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉన్నందున కేసు ను వాయిదా వేయాలని సింఘ్వి కోరారు. దీనిపై బెంచ్‌ వ్యాఖ్యానిస్తూ ‘‘ఈ పిటిషన్‌తోపాటే ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారు. ఇది పద్ధతి కాదు’’అని పేర్కొంది.

ఈ సందర్భంగానే జస్టిస్‌ సందీప్‌ మెహతా రాష్ట్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కేసులో నిందితుడు అప్పీలు చేస్తే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ ఎందుకు?’’ అని ప్రశ్నించారు.

కేసును జూలైనెలకు వాయిదా వేశారు. కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యంగా పోలీసు బలగాల నైతిక స్థయిరాన్ని దెబ్బదీశాయని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

‘‘సీబీఐకి అవసరమైన సహకారం అందించాలంటూ హైకోర్టు చాలా యథాలాపంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుంజుకోవడం కిందకే వస్తుంది’’ అని పేర్కొంది.

Updated Date - Apr 30 , 2024 | 05:39 AM