Rahul : క్యాబినెట్ కాదు..పరివార్ మండల్
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:12 AM
మోదీ ప్రధానిగా కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో పలువురు మంత్రులు రాజకీయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

న్యూఢిల్లీ, రాయబరేలి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రధానిగా కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో పలువురు మంత్రులు రాజకీయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర మంత్రివర్గాన్ని పరివార్ మండల్‌గా అభివర్ణిస్తూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. తరతరాల పోరాటం, సేవ, త్యాగాల సంప్రదాయాన్ని బంధుప్రీతిగా అభివర్ణించేవారు తమ అఽధికారాన్ని మాత్రం ‘సర్కారీ పరివార్’(ప్రభుత్వ కుటుంబానికి)కి పంచుతున్నారని విమర్శించారు. మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నరేంద్ర మోదీ అంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. కాగా రాయబరేలిలో మంగళవారం నిర్వహించిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తన సోదరి ప్రియాంక వారాణసీ నుంచి పోటీ చేసి ఉంటే...మోదీ 2, 3 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయేవారని అన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు ఎన్నికల్లో లడఖ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మహ్మద్ హనీఫా కాంగ్రె్‌సలో చేరడం ఖాయమైంది. తాజా పరిణామంతో లోక్‌సభలో కాంగ్రెస్ బలం 102కు చేరుకోనుంది. కాంగ్రెస్ నుంచి 99 మంది ఎంపీలుగా ఎన్నికవగా సాంగ్లీ ఎంపీ విశాల్‌పాటిల్, పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్ ఇప్పటికే కాంగ్రె్‌సకు మద్దతు ప్రకటించారు.