Share News

అధిక పింఛన్‌ కల్లేనా?

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:21 AM

అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సభ్యుల పింఛన్‌ లెక్కింపులో ఈపీఎ్‌ఫవో కొత్త నిబంధనను ఎంచుకున్నట్టు తెలిసింది.

అధిక పింఛన్‌ కల్లేనా?

లెక్కింపులో ఈపీఎఫ్‌వో కొత్త నిబంధన

పింఛన్‌ మొత్తం 30% తగ్గే అవకాశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సభ్యుల పింఛన్‌ లెక్కింపులో ఈపీఎ్‌ఫవో కొత్త నిబంధనను ఎంచుకున్నట్టు తెలిసింది. 2014 సెప్టెంబరు 1న లేదా ఆ తర్వాత రిటైరైన సభ్యుల సర్వీసు కాలాన్ని రెండు భాగాలుగా విభజించి, దామాషా పద్ధతిలో పింఛన్‌ లెక్కిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఉద్యోగుల పింఛన్‌ పథకం(ఈపీఎస్‌ 95) సభ్యుల పింఛన్‌ 30% నుంచి 40% వరకు తగ్గే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఈపీఎ్‌ఫవో కార్యాలయాల నుంచి అనధికారికంగా ఈ సమాచారం అందినట్టు న్యాయవాద శిక్షణ సంస్థ ‘ఎకనమిక్‌ లాస్‌ ప్రాక్టీ్‌స’కు చెందిన కార్మిక, ఉపాధి శిక్షణ విభాగం అధిపతి పీవీ మూర్తి తెలిపారు. అయితే, ఈ విషయంపై ఈపీఎ్‌ఫవో సర్క్యులర్‌ విడుదల చేయలేదు. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న, లేదా 2014 సెప్టెంబరు 1నగానీ, ఆ తర్వాతగానీ రిటైరైన సభ్యులపై ఈ కొత్త నిబంధన ప్రభావం చూపనుంది. సగటు పెన్షనబుల్‌ వేతనం లెక్కింపు కోసం వీరి సర్వీసు కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నారు.

ఇందులో మొదటి భాగం 16-11-1995(ఈపీఎస్‌-95 అమల్లోకి వచ్చిన తేదీ) నుంచి 31-08-2014 వరకు, రెండో భాగం 01-09-2014 నుంచి రిటైర్మెంట్‌ తేదీ వరకు ఉంటుందని పీవీ మూర్తి తెలిపారు. పింఛన్‌ లెక్కింపు కోసం మొదటి భాగంలోని చివరి 60 నెలల సగటు వేతనాన్ని, అలాగే, రెండో భాగంలోని చివరి 60 నెలల సగటు వేతనాన్ని వేర్వేరుగా లెక్కిస్తున్నారని వివరించారు. 2014 ఆగస్టు 31 వరకు గరిష్ఠ వేతన సీలింగ్‌ రూ.6,500గా ఉంది. 2014 సెప్టెంబరు 1 నుంచి దీన్ని రూ.15,000కు పెంచారు. 2014 సెప్టెంబరు కంటే ముందు వరకు వేతన సీలింగ్‌ చాలా తక్కువ కనుక, నూతన విధానంలో లెక్కింపు వల్ల పింఛన్‌ తగ్గుతుందని మూర్తి చెబుతున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 06:48 AM