నితీశ్ ఓ ఊసరవెల్లి
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:38 AM
నితీశ్ కుమార్‌కు తరచుగా రాజకీయ పిల్లిమొగ్గలు వేయడం అలవాటేనని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.
జేడీయూ అధినేతపై కాంగ్రెస్ ధ్వజం
లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ కనుమరుగే: తేజస్వీ
ఈ బంధం మనుగడ ఏడాదే: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ, పట్నా, కోల్‌కతా, చెన్నై, జనవరి 28: నితీశ్ కుమార్‌కు తరచుగా రాజకీయ పిల్లిమొగ్గలు వేయడం అలవాటేనని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఆయనొక ఊసరవెల్లి అని కాంగ్రెస్ పేర్కొనగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనే జేడీయూ అంతమవుతుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. కాగా, చెత్త.. డస్ట్‌బిన్‌లోకే వెళ్లిందని లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య జేడీయూను ఉద్దేశించి విమర్శించారు. నితీశ్ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయారని డీఎంకే విమర్శించగా, నితీశ్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ హెచ్చరించింది. నితీశ్ కూటమిని వీడనున్న విషయం తనకు ముందే తెలుసని, అయితే, ఇండియా కూటమిని సమైక్యంగా ఉంచేందుకే తాను ఇప్పటివరకు ఆ ప్రస్తావన తేలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ‘ఆయా రామ్-గయా రామ్ లాంటివారు దేశంలో ఎంతోమంది ఉన్నారు. మొదట్లో ఆయన నేను కలిసి పోరాడాం. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో నేను మాట్లాడినప్పుడు నితీశ్ వెళ్లిపోతున్నాడని చెప్పారు’ అని ఖర్గే వెల్లడించారు. నితీశ్ వెళ్లినంత మాత్రాన బీజేపీపై ఇండియా కూటమి పోరాటం ఆగదన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ, నితీశ్ ఈ రాజకీయ డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. కాగా, నితీశ్-బీజేపీ బంధం ఎంతోకాలం మనలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బిహార్‌లో కొత్త ప్రభుత్వం మనుగడ ఏడాది లేదా అంతకంటే తక్కువే ఉంటుందని, 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీరి బంధం తెగిపోనుందని జోస్యం చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే మార్పు ఏర్పడుతుందని, కావాలంటే రాసిస్తానని పీకే తెలిపారు.