Share News

Once again sworn in as CM of Bihar : నితీశ్‌.. తొమ్మిదోసారి!

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:41 AM

గత కొన్ని రోజులుగా నడుస్తున్న నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ తొమ్మిదోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Once again sworn in as CM of Bihar : నితీశ్‌.. తొమ్మిదోసారి!

బిహార్‌ సీఎంగా మరోసారి ప్రమాణం

బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు.. ప్రమాణ స్వీకారానికి హాజరైన నడ్డా

అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

పాత మిత్రులం మళ్లీ కలిశాం.. ఇక విడిపోం

‘ఇండియా’లో సరిగా లేకనే బయటకు: నితీశ్‌

కూటమి సారథ్యం లాక్కోడానికి కాంగ్రెస్‌ కుట్ర

అందుకే ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన

సీట్ల పంపకాలపైనా జాప్యం, దీనివల్లే

విడిపోయాం.. జేడీయూ నేత కేసీ త్యాగి

పట్నా, జనవరి 28: గత కొన్ని రోజులుగా నడుస్తున్న నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ తొమ్మిదోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ నితీశ్‌తో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి ముగ్గురు, జేడీయూ నుంచి ముగ్గురు, మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ పార్టీ హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చాకు చెందిన ఒకరు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. జేడీయూ తాజా మాజీ మిత్రపక్షం ఆర్జేడీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించగా, కాంగ్రెస్‌ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. సీఎంగా ప్రమాణం అనంతరం నితీశ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘గతంలో వారితోనే (ఎన్‌డీఏతో) కలిసి ఉన్నా. ఆ తర్వాత దారులు వేరయ్యాయి. మళ్లీ ఒక్కటయ్యాం. ఇక ఎక్కడికీ వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపడతారని, మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.

అందరి అభిప్రాయాలతోనే నిర్ణయం

అంతకుముందు ఉదయం జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పొత్తులపై నిర్ణయాధికారాన్ని సీఎం నితీశ్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. మరోవైపు, రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై, జేడీయూకి మద్దతివ్వాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సామ్రాట్‌ చౌదరిని పార్టీ శాసనసభాపక్ష నేతగా, మాజీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హాను ఉప నేతగా ఎన్నుకున్నారు. దీనిపై నేతలిద్దరూ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్జేడీ సృష్టించిన జంగిల్‌రాజ్‌ నుంచి బిహార్‌ను కాపాడటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వీరిద్దరితో కలిసి నితీశ్‌కుమార్‌ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజీనామా సమర్పించిన తర్వాత రాజ్‌భవన్‌ బయట విలేకర్లతో నితీశ్‌ మాట్లాడుతూ, మహాఘట్‌బంధన్‌ (ఆర్జేడీ-జేడీయూ) కూటమితోపాటు, ఇండియా కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మహాఘట్‌బంధన్‌ గురించి మీకు అందరికీ తెలుసు. ఇండియా కూటమి కోసం నేను చేసిన ప్రయత్నాలూ తెలుసు. అయితే, కొంతకాలంగా వ్యవహారాలు సరిగా నడవటం లేదు. దీనిపై మా పార్టీలో కూడా అసంతృప్తి నెలకొంది. అందరి అభిప్రాయాలు తీసుకున్నా’ అని తెలిపారు.

కాంగ్రెసే కారణం: జేడీయూ

ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను లాక్కోవాలని కాంగ్రెస్‌ చూసిందని, అందువల్లే తాము బయటకు వచ్చామని జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగి చెప్పారు. ‘డిసెంబరు 19న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును కుట్రపూరితంగా ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు ముంబైలో జరిగిన భేటీలో ప్రధాని అభ్యర్థిని ప్రకటించవద్దని నిర్ణయం జరిగింది. దీనికి భిన్నంగా ఖర్గే పేరును మమతతో ప్రతిపాదింపజేశారు. అంతేగాక, సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ జాప్యం చేస్తూ వస్తోంది. బీజేపీని ఎదుర్కొనే ప్రణాళికలు ఆ కూటమి వద్ద లేవు’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 03:41 AM