Share News

కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు

ABN , Publish Date - May 07 , 2024 | 06:02 AM

మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇకపై మరో అంశంలో ఎన్‌ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి

కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు

  • సిఫార్సు చేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌.. కేంద్ర హోం శాఖకు లేఖ

  • ఉగ్రవాది విడుదలకు ఖలిస్థాన్‌ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు

న్యూఢిల్లీ, మే 6: మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇకపై మరో అంశంలో ఎన్‌ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఉండే నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవేంద్ర పాల్‌ భుల్లర్‌ను విడుదల చేయించడంతో పాటు, ఖలిస్థాన్‌ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆ తీవ్రవాద సంస్థ నుంచి 16 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.135 కోట్లు) తీసుకున్నట్టు వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆషూ మోగియా గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారం చేసుకొని సక్సేనా ఈ లేఖ రాశారు.

2014 నుంచి 2022 వరకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఖలిస్థాన్‌ గ్రూపుల నుంచి 16 మిలియన్‌ డాలర్లు విరాళాలుగా అందాయని పేర్కొంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ విడుదల చేసిన వీడియోను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ప్రొఫెసర్‌ భుల్లర్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆప్‌ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని ఆ లేఖలో రాశారు.

1993లో ఢిల్లీలోని యువజన కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద బాంబు దాడి జరిగిన ఘటనలో భుల్లర్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సంఘటనలో తొమ్మిది మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. జర్మనీలో ఉన్న అతడ్ని 1995లో తీసుకువచ్చి అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు తిహాడ్‌ జైలులో ఉన్నాడు. ట్రయల్‌ కోర్టు అతనికి 2001లో మరణశిక్ష విఽధించగా, 2014లో ఉన్నత న్యాయస్థానం దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. అతని విడుదల కోసం కేజ్రీవాల్‌ న్యూయార్క్‌లోని గురుద్వారా రిచ్‌మాండ్‌ హిల్స్‌లో వేర్పాటువాదులను కలిసినట్టు, వారి నుంచి నిధులు తీసుకున్నట్టు ఫిర్యాదు అందినందున ఎన్‌ఐఏ దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు చేశారు.

న్యూయార్క్‌ గురుద్వారాలో ఖలిస్థాన్‌ అనుకూల వ్యక్తులతో కేజ్రీవాల్‌ భేటీ అయిన ఫొటోను ఆప్‌ మాజీ కార్యకర్త మునీష్‌ కుమార్‌ రైజాదా అప్పట్లో ట్విటర్‌లో పెట్టారు. దాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిపై ఫోరెన్సిక్‌ పరీక్షలతో పాటు, సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు.

మరో కుట్ర

దీనిపై ఆప్‌ స్పందిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బీజేపీ ఏజెంటని, ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసి కేజ్రీవాల్‌పై మరో పెద్ద కుట్రకు తెరతీశారని వ్యాఖ్యానించింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ చెప్పారు.

Updated Date - May 07 , 2024 | 06:02 AM