Share News

Navya : సినిమానే నా ఫస్ట్‌ లవ్‌ !

ABN , Publish Date - Jun 09 , 2024 | 02:40 AM

మోడల్‌, నటి, నిర్మాత... నేహా ధూపియా. పెళ్లయ్యాక కుటుంబ జీవితంతో పాటు మోడల్‌గానూ రాణిస్తోంది. సినిమాలు తక్కువైనా రియాలిటీ షోస్‌తో లైమ్‌లైట్‌లో ఉంది. ‘నోఫిల్టర్‌ నేహా’తో అప్‌డేట్‌ అయిన నేహా ధూపియా గురించి కొన్ని విశేషాలు ఇవే

Navya : సినిమానే  నా ఫస్ట్‌ లవ్‌ !

మోడల్‌, నటి, నిర్మాత... నేహా ధూపియా. పెళ్లయ్యాక కుటుంబ జీవితంతో పాటు మోడల్‌గానూ రాణిస్తోంది. సినిమాలు తక్కువైనా రియాలిటీ షోస్‌తో లైమ్‌లైట్‌లో ఉంది. ‘నోఫిల్టర్‌ నేహా’తో అప్‌డేట్‌ అయిన నేహా ధూపియా గురించి కొన్ని విశేషాలు ఇవే...

ఎనిమిదేళ్ల నుంచి ‘నో ఫిల్టర్‌ నేహా’ పాడ్‌కాస్ట్‌ నిర్వహిస్తోంది నేహా ధూపియా. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. తన స్నేహితురాలు కరీనా కపూర్‌నుంచి, కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, షాహిద్‌ కపూర్‌, తాప్సీ, రష్మిక మందన్నా.. ఇలా స్టార్లతో ఆమె నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లన్నీ దాదాపు సూపర్‌ హిట్టే. దాదాపు బాలీవుడ్‌ స్టార్లందరినీ తన పాడ్‌కాస్ట్‌లకు ఆహ్వానించింది. ‘నటిగా, మోడల్‌గా, పాడ్‌ కాస్ట్‌ హోస్ట్‌గా, టెలివిజన్‌ హోస్ట్‌గా పని చేస్తుంటే.. మల్టీటాస్క్‌ మానుకో. అంత టెన్షన్‌ ఎందుకూ?’ అంటుంటారు మిత్రులు. అయితే నాకు ఇదో సరదా. ఇష్టం.. అంటుంది నేహా ధూపియా. ‘చాలామంది ఇష్టమైన షో ఏదీ? అని అడుగుతారు. నేను సమాధానం చెప్పటం కష్టం. అయితే మొదటి పాడ్‌కాస్ట్‌ కరణ్‌ జోహార్‌తో చేశా. ఇదే బాగా గుర్తుండే ఎపిసోడ్‌’ అంటుంది నేహా ధూపియా.

  • ఎంతో గర్వంగా ఫీలయ్యా...

‘నో ఫిల్టర్‌ నేహా’ పాడ్‌కాస్ట్‌లకు ఆమే నిర్మాత. ఆరో సీజన్‌లో పాడ్‌కాస్ట్‌ వీడియో రూపంలో వచ్చింది. ‘ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా ఉంది. హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించినందుకు గర్వంగా’ ఉందని చెప్పుకుంటుంది నేహా. వాస్తవానికి ఆమె జర్నలిస్ట్‌ కాదు. అయితే హీరోయిన్‌ కావటం.. ఆమె అడిగే ప్రశ్నల విధానం వల్ల సెలబ్రిటీస్‌ అన్‌ఫిల్టర్‌ విషయాలనూ చెప్పుకొచ్చారు. అందుకే ఈ షో నిలబడింది. అన్నట్లు తన ప్రొడక్షన్‌ పేరు ‘బిగ్‌ గర్ల్‌ ప్రొడక్షన్‌’. నేహా ధూపియా తండ్రి.. ‘నీకేం బిగ్‌ గర్ల్‌ ఉండగా.. బెంగ ఎందుకూ?’ అంటుంటాడట. ‘నా బిగ్‌ గర్ల్‌’ వల్ల నాలో హార్డ్‌వర్క్‌ అలవడింది. ‘నాకు రూమర్లు వినటం ఇష్టం ఉండదు. జనాలకు ఇవే ఇష్టం. నేను అలాంటివి అడగలేను. అయినా వారితో సీక్రెట్స్‌ చెప్పించా. ఇకపోతే ఒక మనిషి నా ఎదురుగా మాట్లాడుతుంటే వారి మీద జోకులు వేయటం.. తక్కువ చేయటం చేయలేదు. ఇదే నా సక్సెస్‌’ అంటుందీమె. అన్నట్లు కరోనా సమయంలో ఇద్దరు పిల్లలతో.. ఈ పాడ్‌కాస్ట్‌నూ విజయవంతంగా నిర్వహించింది.


  • అలా అబద్ధం చెప్పను..

నేహా పంజాబీ సిక్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి నేవీలో పని చేశారు. కొచ్చిలో ఆమె పుట్టింది. విద్యాభ్యాసం కొచ్చిలో కొన్నాళ్లు జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో చదివింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ చేసింది. కొన్ని మ్యూజిక్‌ వీడియోలు చేసింది. దీంతో నేహా ధూపియా 2000 సంవత్సరంలో నటిగా అవకాశం చేజిక్కించుకుంది. అది ఇండో-జపనీస్‌ ప్రాజెక్ట్‌.

అలా ఆమె ఇరవయ్యేళ్ల వయసులో సినిమాకోసం పలు దేశాలు తిరిగింది. ‘జూలీ’, ‘షీసా’, ‘షూటవుట్‌ లోఖండ్‌ వాలా’, ‘మిథ్య’, ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ లాంటి చిత్రాలతో పాటు చిన్నపాత్రల్లోనూ నటించింది. 2022లో ‘ఎ థర్స్‌డే’ చిత్రంలో ఏసీపీ పాత్రలో నటించింది. ‘నాకోసం కథలు తయారు చేస్తున్నారు. నాకోసమే స్ర్కిప్టు రాస్తారు అని చెబితే అది అబద్ధం అవుతుంది. నా పని నేను చేసుకుంటున్నా. ప్రొడ్యూసర్‌గా నా మార్గం నేను ఎంచుకున్నా. నా దగ్గరకు వచ్చిన పాత్రలు బావుంటేనే అంగీకరిస్తున్నా. కుటుంబం, నా బిగ్‌ గర్ల్‌ ప్రొడక్షన్‌ పనులతో సరిపోతోంది. ఏదేమైనా సినిమా అంటేనే నాకు ప్రేమ. సినిమానే నా ఫస్ట్‌ లవ్‌.

సోషల్‌మీడియా ట్రోల్స్‌ పట్టించుకోను. నా పని చేస్కుంటూ వెళ్తుంటా. అయితే నా పేరెంట్స్‌, భర్త దగ్గరకు ట్రోల్స్‌ వచ్చినపుడు కోపం వస్తుంది. ఏదేమైనా సెలబ్రిటీలం కాబట్టి ఏదోటి అంటుంటారు. ఆన్‌లైన్‌ నెగటివిటీ ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోను. అందుకే ప్రశాంతంగా ఉంటాను.

Updated Date - Jun 09 , 2024 | 02:40 AM