Share News

NEET : ‘నీట్‌’ మార్కులపై కమిటీ

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:39 AM

నీట్‌-2024 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను సమీక్షించడానికి నలుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర విద్యాశాఖ

NEET : ‘నీట్‌’ మార్కులపై కమిటీ

నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ

1,500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులపై సమీక్ష

న్యూఢిల్లీ, జూన్‌ 8: నీట్‌-2024 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను సమీక్షించడానికి నలుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం ప్రకటించింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుుస్తకాల్లో చేసిన మార్పులు, పరీక్ష కేంద్రాల్లో సమయం వృథా అయిన వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటివి కొందరు విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణమయ్యాయని తెలిపింది. ‘1,500 మంది అభ్యర్థుల ఫలితాలను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో కూడిన నివేదికను సమర్పిస్తుంది. దాని ప్రకారం ఈ అభ్యర్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉంది’ అని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. గ్రేస్‌ మార్కులతో పరీక్ష అర్హత ప్రమాణాలపై ఏ ప్రభావం ఉండదని, అలాగే ఈ అభ్యర్థుల ఫలితాలు సమీక్షించడం అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కమిటీ సిఫారసులను అనుసరించి కొందరు విద్యార్థులకు పరీక్ష మళ్లీ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 05:39 AM