Share News

Nationalist Congress Party : ఎన్‌సీపీ అజిత్‌దే

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:13 AM

మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎవరికి చెందుతుందన్న విషయమై కొన్ని నెలలుగా బాబాయ్‌ శరద్‌ పవార్‌, అబ్బాయ్‌ అజిత్‌ పవార్‌ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమయింది. అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోనిదే అసలైన ఎన్‌సీపీ అని మంగళవారం

 Nationalist Congress Party : ఎన్‌సీపీ అజిత్‌దే

ఎన్నికల గుర్తు కూడా వారికే

ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటన

వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌కు దక్కని పార్టీ

నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన

‘ఇండియా’కు మరో షాక్‌

ఎన్‌డీఏలో చేరనున్న ఆర్‌ఎల్‌డీ?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎవరికి చెందుతుందన్న విషయమై కొన్ని నెలలుగా బాబాయ్‌ శరద్‌ పవార్‌, అబ్బాయ్‌ అజిత్‌ పవార్‌ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమయింది. అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోనిదే అసలైన ఎన్‌సీపీ అని మంగళవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన ‘గోడ గడియారం’ కూడా ఆ పార్టీకే చెందుతుందని తెలిపింది. అసలైన శివసేన ఎవరన్నది తేల్చడానికి పలు రకాల పరీక్షలు నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ లక్ష్యాలు, ఆశయాల పరీక్ష, పార్టీ రాజ్యాంగం, నియమ నిబంధనల పరీక్ష, చట్టసభలు, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆధిక్యత పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది. రెండు గ్రూపులు కూడా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని తెలిపింది. అందువల్ల చట్టసభల్లో ఆధిక్యత ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నట్టు పేర్కొంది. చట్టసభల్లో అజిత్‌ వర్గానికే ఆధిక్యం ఉన్నందున దాన్నే అసలైన ఎన్‌సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. ‘వన్‌ టైం ఆప్షన్‌’ కింద శరద్‌ పవార్‌ వర్గానికి ఎన్నికల కమిషన్‌ కాస్త వెసులుబాటు కల్పించిది. రాజ్యసభ ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని బుధవారం మధ్యాహ్నంలోగానే పార్టీకి కొత్త పేరును ప్రతిపాదించాలని సూచించింది. మూడు పేర్లను ప్రతిపాదించవచ్చని తెలిపింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నట్టు అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. శరద్‌ పవార్‌ వర్గం మాత్రం ఇది దురదృష్టకర నిర్ణయమని అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ ‘‘ఎన్‌సీపీని శరద్‌ పవార్‌ స్థాపించారని అందరికీ తెలుసు. ప్రారంభం నుంచి ఆయనే జాతీయ అధ్యక్షునిగా ఉన్నారని కూడా తెలుసు. అయితే పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది’’ అన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 04:13 AM