3 న్యూస్ చానళ్లకు ఎన్‌బీడీఎస్‌ఏ జరిమానా
ABN , Publish Date - Mar 03 , 2024 | 05:02 AM
విద్వేషాలు, మత కలహాలను ప్రేరేపించేలా కార్యక్రమాలను ప్రసారం చేశారంటూ మూడు న్యూస్ చానళ్లపై న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ
న్యూఢిల్లీ, మార్చి 2: విద్వేషాలు, మత కలహాలను ప్రేరేపించేలా కార్యక్రమాలను ప్రసారం చేశారంటూ మూడు న్యూస్ చానళ్లపై న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్‌బీడీఎ్‌సఏ) చర్యలు తీసుకుంది. న్యూస్ 18 ఇండియా, టైమ్స్ నౌ నవభారత్, ఆజ్‌తక్ చానళ్లకు జరిమానా విధించడమే కాకుండా ఆయా కార్యక్రమాల వీడియోలను ఆన్‌లైన్ (యూట్యూబ్, వెబ్‌సైట్) నుంచి తొలగించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. శ్రద్ధావాకర్ హత్య కేసును ‘లవ్ జిహాద్’గా అభివర్ణిస్తూ మత కలహాలు ప్రేరేపించేలా కార్యక్రమాలను ప్రసారం చేశారంటూ న్యూస్ 18 ఇండియాకు రూ.50 వేల జరిమానా విధించింది. ‘లవ్ జిహాద్’పైనే గతేడాది మే 31న టైమ్స్ నౌ నవభారత్‌లో ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి ఆ చానల్‌కు రూ.లక్ష జరిమానా వేసింది. భారత్‌లోని మైనారిటీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలపై ఆజ్‌తక్ నిర్వహించిన చర్చలో వ్యాఖ్యాత సుధీర్‌చౌదరి ‘తుక్డే తుక్డే గ్యాంగ్, ఖలిస్థానీ ఇన్ పంజాబ్’ పదాలను వాడటంపై ఆ చానల్‌కు రూ.75 వేలు జరిమానాగా విధించింది.