NEET : నీట్ పవిత్రత దెబ్బతింది!
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:28 AM
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు ఉన్న పవిత్రత దెబ్బతిన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్

‘నీట్’పై మీ సమాధానం చెప్పండి
కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు.. తక్షణమే జవాబివ్వాలని ఆదేశం
తదుపరి విచారణ జూలై 8కి.. నీట్ కౌన్సెలింగ్‌పై స్టేకు నిరాకరణ
పరీక్ష, ఫలితాలను అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు
వాటిపై ఇంకా స్పందించని ఎన్టీఏ
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు ఉన్న పవిత్రత దెబ్బతిన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) స్పందనలు తెలియజేయాలంది. నీట్ యూజీ-2024లో ప్రశ్నపత్రం లీజేజీ, అవకతవకలు జరిగినందున ఆ పరీక్షను రద్దుచేయాలని కోరుతూ 10 మంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పరీక్షలో అవకతవకలు జరిగాయని, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘పరీక్ష పవిత్రత దెబ్బతిన్నది. ఇప్పుడు మాకు సమాధానాలు కావాలి’’ అని వ్యాఖ్యానించింది. ఈ ఆరోపణలపై సమాధానాలు ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. అలాగే బిహార్‌లో పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. తక్షణమే సమాధానాలు ఇవ్వాలని కేంద్రం, ఎన్టీఏను ఆదేశించింది. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. ఒకే పరీక్ష కేంద్రంలో ఆరుగురికి 720కి 720 మార్కులు రావడం.. పలు అనుమానాలకు దారితీసింది. మరోవైపు, నీట్-పీజీ 2022 జవాబు పత్రాలను బహిర్గతపర్చాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్‌లో 705 మార్కులు!
నీట్‌పై సోషల్‌మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఆర్యన్ ప్రతీక్ అనే ‘ఎక్స్’ వినియోగదారుడు ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఫెయిలవగా.. నీట్‌లో మాత్రం 720కి 705 మార్కులు సాధించిందంటూ పోస్ట్ చేశారు. నీట్ మార్కుల స్ర్కీన్‌షాట్, ఇంటర్ మార్కుల పత్రం ఫొటోలు కూడా జత చేశారు. ఇదెలా సాధ్యం? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక మరో విద్యార్థిని జూన్ 4న వచ్చిన ఫలితాల్లో తన రిజల్ట్ కనిపించకపోవడంతో సర్వర్ సమస్యగా భావించానని.. ఎన్టీఏ మాత్రం ఓఎంఆర్ షీట్ పాడైపోవడం వల్ల ఫలితాలు ప్రకటించలేదని మెయిల్ పంపినట్లు ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. పాడైన ఓఎంఆర్ షీట్‌ను తనకు పంపాలని కోరగా అందులో అన్ని సమాధానాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.