Share News

PM Modi : ముస్లిం ఓట్ల కోసం ‘ఇండియా’ ముజ్రా డ్యాన్స్‌

ABN , Publish Date - May 26 , 2024 | 06:13 AM

ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా డ్యాన్స్‌’ చేస్తోందని, దళితులు, బీసీల రిజర్వేషన్లను దోచుకుని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఎంతగా అంటే, ముస్లింలకు గుండుగుత్తగా రిజర్వేషన్లను

PM Modi : ముస్లిం ఓట్ల కోసం ‘ఇండియా’ ముజ్రా డ్యాన్స్‌

దళితులు, బీసీల రిజర్వేషన్లు లాగేసి ముస్లింలకు ఇచ్చేస్తారు: మోదీ

బక్సర్‌, మే 25: ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా డ్యాన్స్‌’ చేస్తోందని, దళితులు, బీసీల రిజర్వేషన్లను దోచుకుని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఎంతగా అంటే, ముస్లింలకు గుండుగుత్తగా రిజర్వేషన్లను మళ్లించేసినా కోర్టులు సైతం అడ్డుకోలేనంతగా మార్చేస్తుంది. నేను చెబుతున్న ఈ వ్యాఖ్యలను లిఖిత పూర్వకంగా ఖండించమని సవాల్‌ రువ్వుతున్నా. కానీ, వారు అలా చేయరు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, కూటమి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. శనివారం బిహార్‌లో పర్యటించిన మోదీ బక్సర్‌, కారాకట్‌, పాటలీపుత్ర లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి పక్షాల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పార్టీలు పొరుగు దేశాలకు భయపడుతున్నాయని అన్నారు. ఉగ్రవాదంపై తన పోరును అడ్డుకునేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బిహార్‌ నుంచి వలస వెళ్లిన వారిపై పంజాబ్‌, తెలంగాణలలోని కాంగ్రెస్‌ నాయకులు, తమిళనాడులోని డీఎంకే, బెంగాల్‌లోని టీఎంసీ నేతలు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు ఇక్కడివారిని ఎంత బాధ పెట్టాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. బిహారీలను ఇంతగా అవమానిస్తున్నా ఇక్కడి ఆర్జేడీ నాయకులకు కనీసం నిరసన తెలిపే ధైర్యం కూడా లేదని దుయ్యబట్టారు. తమ లాంతరు(ఎన్నికల గుర్తు)తో ముజ్రా డ్యాన్స్‌ చేయడమే వచ్చని ఎద్దేవా చేశారు. ముజ్రా అనేది మొఘలుల పాలనాకాలంలో పురుషులను ఆకట్టుకోవడానికి మహిళలు చేసే నృత్యం పేరు. బిహార్‌లోని ప్రధాన సామాజిక వర్గం యాదవులు సహా ఇతర సామాజిక వర్గాల పేర్లను ఉటంకించిన ప్రధాని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. వీరంతా తమ రాజ్యాంగ హక్కులను కోల్పోతారని చెప్పారు. ‘‘ఇండియా కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్‌ 4న ఫలితం చూశాక.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఒకరినొకరు కుమ్ముకుని.. ఒకరి బట్టలు ఒకరు చించుకోవడం ఖాయం’’ అని మోదీ అన్నారు.

మోదీ బస చేసిన హోటల్‌కు రూ.80.6 లక్షల బకాయి

మైసూర్‌: ప్రధాని మోదీ 2023 ఏప్రిల్‌లో కేంద్రప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మైసూర్‌కు వచ్చారు. ఈ సమయంలో ఆయన రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ఆయన బస చేశారు. అయితే.. దీనికి సంబంధించి రూ.80.6 లక్షల బిల్లును చెల్లించలేదని హోటల్‌ యాజమాన్యం తాజాగా తెలిపింది. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్టు పేర్కొంది. 2023 ఏప్రిల్‌లో 3 రోజుల పాటు మైసూర్‌లో ‘ప్రాజెక్టు టైగర్‌’ 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయిన వ్యయంలో కేంద్రం నుంచి ఇంకా రూ.3.33 కోట్లు రావాల్సి ఉంది. దీనిలో మోదీ బస చేసిన హోటల్‌ బిల్లు కూడా ఉందని అఽధికారులు తెలిపారు.


నేను 7 సార్లు గెలవొచ్చు!

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఏడు సార్లు గెలిపిస్తానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మూడు సార్లు, ఐదు సార్లు, లేదా ఏడుసార్లు గెలవొచ్చు’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. కేంద్రంలో ఈసారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తే మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారు. ఈ రికార్డు ఇప్పటి వరకు నెహ్రూ పేరు మీద ఉంది.

Updated Date - May 26 , 2024 | 06:13 AM