Share News

Travel Company: ట్రావెల్ కంపెనీ పొరపాటు.. 50 కి.మీ. దూరంలోనే డ్రాప్.. చివరికి రూ.2 లక్షల దెబ్బ

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:05 PM

ట్రావెల్ కంపెనీల పనేంటి? తమ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చాలి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

Travel Company: ట్రావెల్ కంపెనీ పొరపాటు.. 50 కి.మీ. దూరంలోనే డ్రాప్.. చివరికి రూ.2 లక్షల దెబ్బ

ట్రావెల్ కంపెనీల పనేంటి? తమ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చాలి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఆలస్యంగా రావడమో, సరైన సౌకర్యాలు కల్పించకపోవడమో, గమ్యస్థానాల్లో దింపకుండా మరో చోట వదిలేయడమో వంటివి చేస్తాయి. కొందరు వీటిని సీరియస్‌గా తీసుకోరు. ఆ సమయంలో ఫలానా ట్రావెల్ సంస్థలపై కోపం ప్రదర్శిస్తారు కానీ, ఆ తర్వాత లైట్ తీసుకుంటారు. కానీ.. ఒక ముసలాయన మాత్రం అంత ఈజీగా విడిచిపెట్టలేదు. తనని నానా ఇబ్బందులు పెట్టినందుకు.. ఒక ట్రావెల్ కంపెనీపై ఫిర్యాదు చేశాడు. చివరికి ఈ కేసులో తాను నెగ్గి.. పరిహారంగా రూ.2 లక్షలు సాధించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కండివాలి ప్రాంతానికి చెందిన శేఖర్ హట్టంగడి (69) అనే వ్యక్తి.. 2018లో సూరత్ నుండి ముంబైకి టికెట్ బుక్ చేసుకున్నారు. Travelyaari.com అనే ట్రావెల్ పోర్టల్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ఆయన.. పాలో ట్రావెల్స్‌కి చెందిన బస్సులో ప్రయాణం చేశారు. అయితే.. అహ్మదాబాద్-ముంబై హైవేలో మరమ్మతుల పనులు జరుగుతుండటంతో.. డ్రైవర్ బస్సుని ప్రధాన రహదారి నుండి థానేకి మళ్లించాడు. దీంతో.. ఆయన చేరాల్సిన గమ్యస్థానం మిస్ అయ్యింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. రూట్ మ్యాప్‌లో మార్పులు చేయడం జరిగిందని బదులిచ్చారు. అంతేకాదు.. గమ్యస్థానానికి 50 కిలోమీటర్ల దూరంలో ముంబై శివార్లలో ఆయన్ను బలవంతంగా దింపేశారు. దీంతో.. ఆ ముసలాయన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తనకు జరిగిన ఈ అన్యాయం పట్ల కోపాద్రిక్తుడైన ఆయన.. వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని వివరించాడు.


రూట్ మ్యాప్ మార్పు గురించి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, గమ్యస్థానానికి 50 కిలోమీటర్ల దూరంలోనే బలవంతంగా దింపేయడం వల్ల తాను అసౌకర్యానికి గురవ్వడంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని శేఖర్ హట్టంగడి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సూరత్‌లో తనకు సరైన పికప్ పాయింట్ కూడా అందించలేదన్న ఆయన.. గమ్యస్థానానికి చేరుకునేందుకు తనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా కల్పించలేదని అన్నారు. తనకు కలిగించిన ఈ అసౌకర్యానికి గాను మాంటిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే క్షమాపణలు చెప్పిందే తప్ప ఎటువంటి బాధ్యత తీసుకోలేదని ఎత్తిచూపారు. ఈ మేరకు ఆయన చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌.. బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతనికి రూ.2 లక్షల జరిమానా ఇవ్వాలని ఆదేశించింది.

‘‘రూట్ మ్యాప్ మార్చినప్పుడు ప్రయాణికులకు తప్పకుండా సమాచారం అందించాలి. కానీ.. ఇక్కడ శేఖర్ హట్టంగడి విషయంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అలాగే.. గమ్యస్థానానికి 50 కిలోమీటర్ల దూరంలోనే డ్రాప్ చేసి ఆయనకు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి.. నష్టపరిహారంగా బాధితుడికి రూ.2 లక్షలు, అలాగే రూ.2 వేలు న్యాయ ఖర్చులు ఇవ్వాలి’’ అంటూ మాంటిస్ టెక్నాలజీస్, పాలో ట్రావెల్స్‌కి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jan 14 , 2024 | 08:05 PM