Share News

రక్షణ రంగంతో మోదీ ఆటలు : ఖర్గే

ABN , Publish Date - May 29 , 2024 | 03:33 AM

ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రకటనలన్నీ వ్యర్థ ప్రేలాపనలేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే విమర్శించారు.

రక్షణ రంగంతో మోదీ ఆటలు : ఖర్గే

న్యూఢిల్లీ, మే 28:ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రకటనలన్నీ వ్యర్థ ప్రేలాపనలేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే విమర్శించారు. అగ్నిపథ్‌ పథకం ద్వారా దేశ రక్షణ రంగంతో మోదీ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశభక్త యువతకు న్యాయం చేస్తామని ‘ఎక్స్‌’ వేదికలో హామీఇచ్చారు. ఇదే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ కూడా వ్యక్తం చేశారు. చైనా దురాక్రమణను తూర్పు లద్ధాక్‌లో నిలువరించాల్సిన తరుణంలో ఇలా సైనిక నియామకాలను తగ్గించుకుంటూ పోవడం ఏమిటని రమేశ్‌ ప్రశ్నించారు. కాగా, అగ్నిపథ్‌ విషయంలో మోదీ ప్రభుత్వానికి తాను మూడు ప్రశ్నలు వేస్తున్నట్టు ఖర్గే తెలిపారు. ‘‘అగ్నిపథ్‌ అమలుతో ఏటా జరిపే నియామకాల సంఖ్య 75వేలు నుంచి 46 వేలుకు పడిపోవడం వాస్తవం కాదా? అగ్నిపథ్‌ పథకం బాగుంటే, అందులో మార్పులు చేస్తామని ఎందుకని రక్షణ మంత్రి పదేపదే చెబుతున్నారు? కొత్తగా నియామకాలు తగ్గిపోవడం పట్ల మిలిటరీ వ్యవహారాల విభాగం, సైన్యం ఆందోళనతో ఉన్న మాట నిజం కాదా? ఇంత తక్కువగా భర్తీ ఉండటం ఈ దశాబ్దకాలంలోనే ఇది తొలిసారి కాదా?’’ అని ఖర్గే ప్రశ్నలు సంధించారు. కాగా, తమకు 400 సీట్లు వస్తాయని మోదీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ఈసారి 200 సీట్లు కూడా కష్టమేనని అమృత్‌సర్‌లో ఖర్గే అన్నారు. ‘బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో ఏర్పాటుకాదు. మోదీవన్నీ వ్యర్థ ప్రేలాపనలు’’ అని మండిపడ్డారు. ‘కేరళ, తమిళనాడులో బీజేపీ లేదు. కర్ణాటకలో కమలం బలంగా లేదు. మహారాష్ట్రలో బలహీనపడింది. బెంగాల్‌, ఒడిసాల్లో సీట్ల కోసం పోరాడుతోంది. ఇదీ బీజేపీ పరిస్థితి. ఇక 400 సీట్ల మాటెక్కడ?’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. జూన్‌ 4 ఫలితాల తర్వాత ఓటమికి బాధ్యుడుని చేసి ఖర్గే పదవిని కాంగ్రెస్‌ ఊడగొడుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ కోసం చిన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు.

Updated Date - May 29 , 2024 | 03:34 AM