Share News

రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:11 AM

లోక్‌సభ ఎన్నికలు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు.

రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం

అది జరక్కుండా ‘ఇండియా’ ఆపుతోంది: రాహుల్‌.. వయనాడ్‌ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్‌

వెంట సోదరి ప్రియాంక

పట్టణంలో భారీ రోడ్‌షో

వయనాడ్‌, ఏప్రిల్‌ 3: లోక్‌సభ ఎన్నికలు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని, అది జరక్కుండా ఆపేందుకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి కృషి చేస్తున్నాయని చెప్పారు. సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా.. బుధవారం వయనాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం 10.45 గంటలకు కన్నూర్‌ నుంచి ఇక్కడికి సమీపంలోని ముప్పయ్‌నాడ్‌ గ్రామంలోని హెలిప్యాడ్‌ వద్ద హెలికాప్టర్లో దిగారు. అక్కడ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాల్‌పేటలోని కొత్త బస్టాండ్‌ వద్దకు రోడ్డుమార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి 11.30 గంటలకు భారీ రోడ్‌షోతో వయనాడ్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సివిల్‌ స్టేషన్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఆయన ఓపెన్‌ వాహనంపై నిలబడి కార్యకర్తలు, మద్దతుదారులకు అభివాదం చేశారు. ఆయన పక్కన ప్రియాంక, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, దీపా దాస్‌మున్షీ, ఎన్‌ఎ్‌సయూఐ ఏఐసీసీ ఇన్‌చార్జి కన్హయ్యకుమార్‌, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌, కేపీసీసీ యాక్టింగ్‌ అధ్యక్షుడు ఎంఎం హసన్‌ తదితరులు కూడా ఉన్నారు. సివిల్‌ స్టేషన్‌ వద్ద రాహుల్‌ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. వయనాడ్‌ కలెక్టర్‌-రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశాక విలేకరులతోనూ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ ఒక వైపు..

వాటిని కాపాడే శక్తి (కాంగ్రెస్‌, ఇండియా కూటమి) మరోవైపు మోహరించాయని తెలిపారు. వయనాడ్‌ సమస్యల గురించీ ప్రస్తావించారు. గత దశాబ్ద కాలంలో ఏనుగులు, పెద్దపులుల దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు దేశం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు కలిగిన వయనాడ్‌ తనకు వెలుగు దివ్వెలా నిలిచిందన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞుడినని.. ఇప్పుడు ‘న్యాయ్‌’ శకంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో వారందరికీ తన శక్తిమేరకు సేవ చేసేందుకు తిరిగి కంకణబద్ధుడినవుతానని చెప్పారు. వయనాడ్‌ ప్రజలను చెల్లెలు ప్రియాంక మాదిరిగా తన కుటుంబంగానే పరిగణిస్తున్నానని.. ఓటర్లుగా చూడడం లేదని ఆ తర్వాత ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. క్రూర జంతువుల దాడులు, రాత్రివేళ ప్రయాణాలు, వైద్య కళాశాల సమస్యల పరిష్కారానికి కేంద్ర సర్కారు, కేరళలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని.. కానీ అవి సానుకూల చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కాగా.. గత ఎన్నికల్లో రాహుల్‌ తన సమీప సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ దఫా సీపీఐ నేత అన్నీ రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌తో తలపడుతున్నారు. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు 26న పోలింగ్‌ జరుగనుంది.

వయనాడ్‌లో స్మృతి ప్రచారం

కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్‌ రాహుల్‌కు పోటీగా వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి గురువారం నామినేషన్‌ వేయనున్నారు. తర్వాత, రోడ్‌ షో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీ కూడా పాల్గొనున్నారు. 2019లో అమేథీలో స్మృతి ఇరానీ రాహుల్‌ గాంధీని ఓడించిన సంగతి తెలిసిందే. అప్పుడు వయనాడ్‌లో కూడా పోటీ చేసి గెలిచిన రాహుల్‌పై ఈసారి ఒత్తిడి పెంచడానికి ఆమె వయనాడ్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇంటింటికీ కాంగ్రెస్‌

‘ఘర్‌ ఘర్‌ గ్యారంటీ’ ప్రారంభం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీ తమ ‘పాంచ్‌ న్యాయ్‌- పచ్చీస్‌ గ్యారెంటీ’లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజాగా.. ‘ఘర్‌ ఘర్‌ గ్యారంటీ’ పేరిట మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌తో కలిసి బుధవారం ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ హామీలపై సుమారు ఎనిమిది కోట్ల కుటుంబాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఖర్గే తెలిపారు. 14 భాషల్లో ముద్రించిన ‘పాంచ్‌ న్యాయ్‌ - పచ్చీస్‌ గ్యారెంటీ’ కరపత్రాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతి కుటుంబానికీ చేరుస్తారని, వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మోదీ గ్యారెంటీని ప్రజలు విశ్వసించట్లేదన్నారు. తప్పుదోవ పట్టించి, భ్రమల్లోకి నెట్టి మళ్లీ అధికారంలోకి రావాలనే వారికి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 04 , 2024 | 04:21 AM