Share News

అవినీతిపరులు జైలుకే!

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:15 AM

అవినీతిపరులను రక్షించడానికి కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తనను ఎంత బెదిరించినా.. తప్పుచేసినవారు జైలుకు వెళ్లక

అవినీతిపరులు జైలుకే!

ఇది మోదీ గ్యారెంటీ

కాంగ్రెస్‌కు పేదలు పట్టరు

ప్రజలే నాకు రక్షాకవచం

2 రాష్ట్రాల్లో మోదీ ప్రచారం

దాని ‘లూటీ లైసెన్స్‌’ను రద్దుచేశా

అందుకే నన్ను దూషిస్తున్నారు

ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్రల్లో మోదీ

రాయ్‌పూర్‌/జగ్‌దల్‌పూర్‌/చంద్రాపూర్‌, ఏప్రిల్‌ 8: అవినీతిపరులను రక్షించడానికి కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తనను ఎంత బెదిరించినా.. తప్పుచేసినవారు జైలుకు వెళ్లక తప్పదని.. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని స్పష్టం చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్‌ జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘విజయ సంకల్ప్‌ శంఖనాద్‌’ సభలో, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ సభలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యానంతరం అవినీతి కాంగ్రెస్‌.. పేదల అవసరాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. వారి బాధలు దానికి తెలియవని చెప్పారు. ఆ పార్టీ పాలనలో అవినీతి మన దేశానికి గుర్తింపుగా మారిందన్నారు. దోపిడీ చేయడానికి తనకు లైసెన్స్‌ ఉందని భావిస్తోందని.. తాను వచ్చాక దానిని రద్దుచేశానని.. ప్రజలే తనకీ అధికారం ఇచ్చారని.. దీంతో విపక్ష నేతలు తనను దూషిస్తున్నారని విమర్శించారు. అయితే దేశ ప్రజలు, తల్లులు, సోదరీమణులు తనకు రక్షణ కవచంలా నిలబడ్డారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ తెచ్చిన మేనిఫెస్టోపై ముస్లింలీగ్‌ ముద్ర కనిపిస్తోందని పునరుద్ఘాటించారు. కాంగ్రె్‌సను ఆయన కాకరకాయతో పోల్చారు. నేతిలో వేపినా, చక్కెరలో కలిపినా దాని రుచి మారదని చెప్పారు. దేశంలోని అన్ని సమస్యలకూ ఆ పార్టీయే మూలమని ఆరోపించారు. మతప్రాతిపదికన దేశ విభజన, కశ్మీరు సమస్య, నక్సలిజానికి దానిదే బాధ్యతని దుయ్యబట్టారు.

‘అవినీతి.. పేదల హక్కులను నాశనం చేస్తుంది. 2014కి ముందు లక్షల కోట్ల విలువచేసే కుంభకోణాలకు పాల్పడ్డారు. అభివృద్ధి కోసం కేటాయించే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు అందుతోందని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్వయంగా చెప్పారు. మిగతా 85 పైసలు ఎవరు స్వాహా చేశారు? బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు జమచేసింది. ఢిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయి వంద శాతం లబ్ధిదారులకు చేరుతోంది. అదే కాంగ్రెస్‌ ఇప్పుడు అధికారంలో ఉండి అదే 15 పైసల ఆనవాయితీ కొనసాగి ఉంటే సదరు 34 లక్షల కోట్లలో 28 లక్షల కోట్లు బొక్కేసేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై నేను కఠిన చర్యలు తీసుకుంటున్నందున కర్రలతో నా తల బద్దలు కొట్టాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మోదీ ఇలాంటి బెదిరింపులకు భయపడడు. నాకు నా దేశమే నా కుటుంబం. అవినీతిని నిర్మూలించాలని నేను పిలుపు ఇస్తుంటే.. అవినీతిపరులను కాపాడండని విపక్షాలు అంటున్నాయి’ అని ధ్వజమెత్తారు.

రామాలయ ప్రతిష్ఠకు రమ్మంటే..

అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తే విపక్షాలు నిరాకరించడంపై మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆలయ నిర్మాణంపై కాంగ్రెస్‌, ఇండీ కూటమి ఆగ్రహంగా ఉన్నాయి. శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించిన కాంగ్రెస్‌ రాజకుటుంబం ఆలయ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఇది తప్పని చెప్పిన కాంగ్రెస్‌ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే ఆలయ ప్రతిష్ఠాపనకు వచ్చినవారిపైనా ఆరేళ్లు వేటు వేశారు. ముస్లింలను సంతృప్తిపరచడానికి కాంగ్రెస్‌ ఎందాకైనా వెళ్తుందనడానికి ఇదే నిదర్శనం. శ్రీరామనవమి ఎంతో దూరంలో లేదు. ఈ దఫా రామ్‌లల్లాను టెంట్‌లో కాకుండా భవ్య ఆలయంలో అందరూ చూడబోతున్నారు’ అని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌ శ్రీరాముడి మాతామహుల జన్మస్థలమని.. 500 ఏళ్ల తర్వాత రామాలయ నిర్మాణ కల నెరవేరడంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండడం సహజమేనని చెప్పారు. గిరిజనులు బీజేపీకి ప్రాధాన్య వర్గమని స్పష్టం చేశారు. ‘గిరిజన బిడ్డ (ద్రౌపది ముర్ము) ఇవాళ మన దేశానికే రాష్ట్రపతి. ఛత్తీ్‌సగఢ్‌కు గిరిజన సీఎం(విష్ణుదేవ్‌ సాయ్‌)ను అందించింది బీజేపీనే. గిరిజనులకు ప్రత్యేక శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ పెట్టింది కూడా మేమే’ అని గుర్తుచేశారు.

Updated Date - Apr 09 , 2024 | 04:15 AM