Share News

Mission Divyastra : తిరుగులేని ‘దివ్యాస్త్రం’!

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:14 AM

ఒక దెబ్బకు రెండు పిట్టలు..! ఇది పాత మాట..! ఇప్పుడు ఒకే దెబ్బకు ఏకకాలంలో రెండు కంటే ఎక్కువ పిట్టలు అని చెప్పుకోవాలి. భారత అమ్ముల పొదిలోకి మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికిల్‌(ఎంఐఆర్వీ) సాంకేతికత చేరింది.

 Mission Divyastra : తిరుగులేని ‘దివ్యాస్త్రం’!

మిషన్‌ దివ్యాస్త్ర

భారత్‌ అమ్ముల పొదిలో ఎంఐఆర్వీ టెక్నాలజీ

తల్లి వార్‌హెడ్‌, పిల్ల వార్‌హెడ్లకు వేర్వేరు లక్ష్యాలు

అన్నింటికీ గైడెడ్‌, కంట్రోలింగ్‌ సాంకేతికత

అగ్ని-5 క్షిపణితో విజయవంతంగా పరీక్ష

అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా సరసన

ఎంఐఆర్వీ టెక్నాలజీలో భారత్‌కు చోటు

ఎంఐఆర్వీలో పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికత

తొలి ప్రయత్నంలోనే డీఆర్‌డీవో విజయం

వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు!

ఒక దెబ్బకు రెండు పిట్టలు..! ఇది పాత మాట..! ఇప్పుడు ఒకే దెబ్బకు ఏకకాలంలో రెండు కంటే ఎక్కువ పిట్టలు అని చెప్పుకోవాలి. భారత అమ్ముల పొదిలోకి మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికిల్‌(ఎంఐఆర్వీ) సాంకేతికత చేరింది. అంటే.. ఒకే మిసైల్‌తో పలు వార్‌హెడ్‌లను ఏకకాలంలో ప్రయోగించి, వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించవచ్చు. అంతేకాదు.. పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మ నిర్భర్‌ భారత్‌, ‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భాగంగా డీఆర్‌డీవో ఈ సాంకేతికత సాధించింది. వార్‌హెడ్‌లు ఒక్కసారి రీ-ఎంట్రీ అయ్యాయంటే, వాటిని గుర్తించడం శత్రు దేశాలకు దాదాపు అసాధ్యమే..! అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగల అగ్ని-5 ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిసైల్‌తో భారత్‌ సోమవారం ఎంఐఆర్వీ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది.

ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

అల్వాల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎంఐఆర్వీ సాంకేతికతను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించడంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. ‘‘డీఆర్‌డీవో మరో ఘనత సాధించింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల ఎంఐఆర్వీని ‘అగ్ని-5’ క్షిపణిపై విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ప్రశంసించారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. ‘‘ఈ ఘనత దేశ రక్షణతోపాటు.. వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ముర్ము ఓ ప్రకటనలో తెలిపారు.

భారత్‌ అమ్ముల పొదిలో ఎంఐఆర్వీ టెక్నాలజీ

న్యూఢిల్లీ, మార్చి 11: ‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భారత్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ఎంఐఆర్వీ సాంకేతికతతో.. 5 వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే.. ఏకకాలంలో ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా బహుళ రీ-ఎంట్రీ వాహనాలను(వార్‌హెడ్‌లు) ప్రయోగించడం. ఇప్పటి వరకు ఎంఐఆర్వీ టెక్నాలజీ ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ ఉన్నాయి. అగ్ని-5తో పరీక్షించిన ఎంఐఆర్వీ విజయవంతం అవ్వడంతో.. ఆ దేశాల సరసన భారత్‌ చేరింది. పాకిస్థాన్‌ 2017లో 2,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ‘అబాబీల్‌’ మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఎంఐఆర్వీ టెక్నాలజీతో పరీక్షించింది. ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణి అయిన అగ్ని-5 ద్వారా భారత్‌ ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది.

శత్రువుకు చిక్కదు.. దొరకదు..!

సాధారణంగా క్షిపణులను ఇంటర్‌సెప్ట్‌ చేసి, వాటిని గాల్లోనే ధ్వంసం చేసే సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది. ఇటీవల హమాస్‌ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వ్యవస్థ పతాక శీర్షికలకెక్కింది. అయితే.. ఎంఐఆర్వీ సాంకేతికతలో అలా ఇంటర్‌సెప్ట్‌ చేయడం దాదాపు అసాధ్యమే..! బాలిస్టిక్‌ క్షిపణులు లక్ష్యాన్ని చేరేముందు భూ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తాయి. లక్ష్యాన్ని చేరడానికి తిరిగి భూ వాతావరణంలోకి రావడాన్ని రీ-ఎంట్రీ అంటారు. భారత్‌ అభివృద్ధి చేసిన ఎంఐఆర్వీలో.. క్షిపణి ప్రయోగం జరిగాక.. టార్గెట్లను నిర్దేశించిన వార్‌హెడ్‌లు భూవాతావరణంలోకి రీ-ఎంట్రీ అయితే.. వాటిని నిరోధించడం శత్రుదేశాలకు సాధ్యమయ్యే పనికాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. భారత ఎంఐఆర్వీలో అన్ని వార్‌హెడ్లకు గైడెడ్‌, కంట్రోలింగ్‌, ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలున్నాయి. ‘‘మన ఎంఐఆర్వీలకు కచ్చితత్వంతో దూసుకుపోయేలా సెన్సర్లున్నాయి. వార్‌హెడ్లు ఒక్కసారి రీ-ఎంట్రీ అయితే.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. చైనా ఉత్తరభాగంతోపాటు.. ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మొత్తం అగ్ని-5 క్షిపణి పరిధిలో ఉంటుంది’’ అని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ వార్‌హెడ్‌లు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇందుకోసం అగ్ని-5లో బహుళ వార్‌హెడ్‌లను అమర్చేందుకు వీలుంటుంది. న్యూక్లియర్‌ వార్‌హెడ్లను కూడా ఎంఐఆర్వీలో తరలించవచ్చు. భారత్‌ ఒక్కసారి ఎంఐఆర్వీతో ఎదురుదాడి చేస్తే శత్రుదేశాలకు కోలుకోని దెబ్బ తప్పదు’’ అని డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ జనరల్‌, ప్రస్తుతం నీతి ఆయోగ్‌ శాస్త్ర సాంకేతిక విభాగం సభ్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్‌ వీకే సారస్వత్‌ వెల్లడించారు.

వరుసగా క్షిపణుల ప్రయోగాలు?

భారత్‌ మరికొన్ని క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో నో ఫ్లైజోన్‌ను ప్రకటించింది. నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌(నోటమ్‌) ప్రకటన చేసింది. ఒక ప్రాంతాన్ని నోటమ్‌గా ప్రకటిస్తే.. ఏక్షణంలోనైనా క్షిపణి ప్రయోగాలు జరపవచ్చని దాని అర్థం. అగ్ని-5 ద్వారా ఎంఐఆర్వీని విజయవంతంగా పరీక్షించిన భారత్‌.. జలాంతర్గాముల ద్వారా ప్రయోగించడానికి రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి కే-4ను పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి రెండు టన్నుల బరువున్న వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బంగాళాఖాతం పరిధిలో తాజాగా జారీచేసిన నోటమ్‌ ఈ నెల 16 దాకా కొనసాగనుంది. నోటమ్‌ ఫ్లైజోన్‌ కూడా బంగాళాఖాతానికి దక్షిణాన 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కే-4 క్షిపణి పరిధి కూడా 3,500 కిలోమీటర్లు.

క్షుణ్ణంగా పరిశీలిస్తున్న డ్రాగన్‌?

హిందూ మహాసముద్ర ప్రాంతంపై చైనా కొంతకాలంగా నిఘా పెంచింది. గత నెలలో శ్రీలంక సముద్ర తీరంలో తన పరిశోధనా నౌక (జియాన్‌ యాంగ్‌హాంగ్‌-3)ను ఉంచిన డ్రాగన్‌.. తాజాగా బంగాళాఖాతంలోనూ పరిశోధన నౌక జియాన్‌ యాంగ్‌హాంగ్‌-01ను మోహరించింది. ఒడిసా తీరంలో భారత్‌ క్షిపణి పరీక్షలకు సిద్ధమైన వేళ చైనా చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. నోటమ్‌ను ప్రకటించగానే చైనా నౌక విశాఖ సముద్ర తీరానికి 260 నాటికల్‌ మైళ్ల (480 కిలోమీటర్లు) దూరంలో లంగరు వేయడం గమనార్హం..! ఈ నెల 6న మలక్కా జలసంధి మీదుగా ప్రవేశించిన ఆ నౌక.. 8న నికోబార్‌ ద్వీపం, భారత ద్వీపకల్పం మధ్య కనిపించింది. ఉపరితల ధ్వని సంకేతాలను గుర్తించే సెన్సర్లు ఆ నౌకలో ఉన్నాయని భారత్‌ భావిస్తోంది. భారత నౌకాదళం ఆ నౌక కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Mar 12 , 2024 | 04:03 AM