Grammy Awards : గ్రామీ అవార్డుల్లో మనోళ్ల ‘శక్తి’
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:24 AM
సంగీత రంగంలో ఆస్కార్లుగా భావించే గ్రామీ అవార్డుల్లో మనోళ్లు సత్తా చాటారు! అమెరికాలోని లాస్ ఏంజెలె్‌సలో అంగరంగ వైభోగంగా జరిగిన 2024 గ్రామీ వేడుకల్లో.. ఐదుగురు భారతీయులు ఈ ప్రతిష్ఠాత్మక
ఐదు పురస్కారాలు సాధించిన భారతీయులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: సంగీత రంగంలో ఆస్కార్లుగా భావించే గ్రామీ అవార్డుల్లో మనోళ్లు సత్తా చాటారు! అమెరికాలోని లాస్ ఏంజెలె్‌సలో అంగరంగ వైభోగంగా జరిగిన 2024 గ్రామీ వేడుకల్లో.. ఐదుగురు భారతీయులు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను దక్కించుకున్నారు. ఆ ఐదుగురూ.. తబలా మ్యాస్ట్రో జాకీర్‌హుస్సేన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, వాయులీన విద్వాంసుడు గణేశ్ రాజగోపాలన్, పెర్కూషనిస్ట్ సెల్వగణేశ్ వినాయక్‌రామ్ ఉన్నారు. వీరిలో జాకీర్ హుస్సేన్ ఏకంగా మూడు గ్రామీలు సాధించగా.. రాకేశ్ చౌరాసియా రెండు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ విభాగంలో మనదేశానికి చెందిన ప్రముఖ ఫ్యూజన్ బ్యాండ్ శక్తి రూపొందించిన ‘దిస్ మూమెంట్’.. పురస్కారాన్ని గెలుచుకుంది. బ్రిటిషర్ జాన్ మెక్‌లాఫ్లిన్ నేతృత్వంలోని ఈ బ్యాండ్‌లో జాకీర్ హుస్సేన్, శంకర్‌మహదేవన్, సెల్వగణేశ్, గణేశ్ రాజగోపాలన్ ఉన్నారు. జాకీర్‌హుస్సేన్‌కు ఈ పురస్కారంతోపాటు.. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ (పష్తో), బెస్ట్ కాంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ (యాజ్ వియ్ స్పీక్) విభాగాల్లో మరో రెండు గ్రామీలు వచ్చాయి. కాగా.. గ్రామీ అవార్డు సాధించిన ఐదుగురినీ ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా అభినందించారు.
తమ అత్యద్భుతమైన ప్రతిభతో, సంగీతం పట్ల అంకితభావంతో వారు గ్రామీ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రపంచప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ అవార్డులు వారి శ్రమకు ఒక గుర్తింపు అని.. సంగీత రంగంలో ఎంతో సాధించాలనే కలలతో వచ్చే భవిష్యత్తు కళాకారులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు. కాగా.. జాకీర్‌హుస్సేన్ 1991, 1996, 2008 సంవత్సరాల్లో కూడా గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. ఇక, 2008లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి అందించిన సంగీతానికిగాను రెండు గ్రామీలు అందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్.. జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, సెల్వగణేశ్‌తో తీసుకున్న గ్రూప్ సెల్ఫీని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. గ్రామీ విజేతలను ఆయన అభినందించారు.