Share News

India Party : ఇండియా’లో ఆగని మంటలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:36 AM

‘ఇండియా’ కూటమి పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి పార్టీలు కాంగ్రె్‌సపై నిప్పులు

India Party : ఇండియా’లో ఆగని మంటలు

యూపీలో 11 సీట్లే ఇస్తాం: అఖిలేశ్‌.. సీట్ల కోసమే కాంగ్రెస్‌ వల: డీఎంకే..

ముదిరిన అంతర్గత కుమ్ములాట

ఐక్యతకు కృషి చేస్తున్నాం: ఖర్గే

బెంగళూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి), న్యూఢిల్లీ: ‘ఇండియా’ కూటమి పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి పార్టీలు కాంగ్రె్‌సపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌లోని అధికార ఆప్‌, పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీలు పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని స్పష్టం చేశాయి. ఇక ఇప్పుడు మరిన్ని పార్టీలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో సీట్లకోసమే తమ వెంట పడుతోందని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే విమర్శలు గుప్పించగా, కేవలం 11 సీట్లకు మించి ఇచ్చేది లేదని యూపీ ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తేల్చి చెప్పారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

11తో మొదలు పెడదాం: ఎస్పీ

‘‘మా సహృదయ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి 11 సీట్లు ఇస్తున్నాం. ఇక్కడ నుంచి యుద్దం మొదలుపెడదాం. ఇది విజయాన్ని అందించే ఫార్ములా. ఇండియా కూటమి చరిత్రను మారుస్తుంది’’ అని సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఆ 11 స్థానాలు కూడా చాలా బలమైనవేనని చెప్పారు. అయితే.. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఇంతలోనే ఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు గుర్రాలను చూపిస్తే మరిన్ని సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్‌ సిద్ధమేనని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇంకో ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌.. ఎస్పీ నేత అఖిలేశ్‌తో సీట్ల విషయంపై చర్చలు జరుపుతున్నారని తెలిపింది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత వెల్లడిస్తామని వివరించింది. ఇదిలావుంటే, శనివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై అఖిలేశ్‌ విమర్శలు గుప్పించారు. కూటమి పార్టీలతో ఏ విషయం కూడా చర్చించడం లేదని.. అసలు చర్చించే ఆలోచన కూడా కాంగ్రె్‌సకు ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు.

కాంగ్రెస్‌కు బలం లేదు: డీఎంకే

ఇండియా కూటమి పార్టీ, తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా మిత్రపక్షం కాంగ్రె్‌సపై విమర్శలు గుప్పించింది. సుదీర్ఘ చరిత్ర, అతి పెద్ద కేడర్‌ ఉన్న పార్టీనే అయినప్పటికీ.. ఇప్పుడు ఆ పార్టీ సత్తువ కోల్పోయిందని డీఎంకే నేత, మంత్రి రాజా కన్నప్పన్‌ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కోసమే పార్టీ తమ వెంట పడుతోందని దుయ్యబట్టారు. ‘‘కాంగ్రె్‌స ను గమనిస్తే సీట్ల కోసమే వారు పార్టీని నడుపుతున్నట్టుంది. కానీ, దానివల్ల ప్రయోజనమేంటి? కష్టపడి పనిచేయాలని, ప్రజలకు మంచి చేయాలని భావించి వారు పార్టీని నడపడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే వారు వస్తారు. ఈ తరహా ఆలోచన ప్రజల మధ్య పనిచేయదు’’ అని రాజా నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని, కానీ, తాము ఆ పార్టీని తరిమికొడతామని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఆదివారం డీఎంకే, కాంగ్రెస్‌ భేటీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్‌ బట్టలూడదీశారు: బీజేపీ

ఇండియా కూటమి పార్టీల్లో కాంగ్రె్‌సపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘కూటమి పార్టీలన్నీ సమష్టిగా కాంగ్రెస్‌ బట్టలూడదీశాయి’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె. అన్నామలై ఎద్దేవా చేశారు. డీఎంకే మంత్రి రాజా చేసిన వ్యాఖ్యల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన ఆయన.. కూటమి పార్టీలు వాస్తవాలు చెబుతున్నాయన్నారు. కాంగ్రె్‌సలో నేతలే తప్ప కేడర్‌ లేదని విమర్శించారు.

ఖర్గే ఏమన్నారంటే..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం కలబురగి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి ఐక్యత కోసం కలసి పనిచేద్దామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోపాటు కూటమిలోని పార్టీ నేతలకు లేఖలు రాశానని తెలిపారు. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేసే విషయం తనకు తెలియదని, నితీశ్‌ గవర్నర్‌ను కలిశారో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఐక్యత ముఖ్యమని తెలిపారు. కాగా, బిహార్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయాలపై నితీశ్‌కుమార్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించినా ఆయన బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2024 | 01:36 AM