Share News

Maldives Tourism : మాల్దీవుల టూరిజం మటాష్‌..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:16 AM

నీలి రంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. తెల్లటి ఇసుక తిన్నెలు.. ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతి అందాలు.. వెరసి మాల్దీవులు...! హాలిడే్‌సలో జీవితాన్ని సరదాగా గడపడానికి అందరూ ఎంచుకునే అందమైన పర్యాటక ప్రాంతం.

Maldives Tourism : మాల్దీవుల టూరిజం మటాష్‌..!

భారత్‌ కన్నెర్ర చేస్తే జరిగేదిదే.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’

సెలెబ్రిటీలు, సామాన్యుల నిరసన.. హోటళ్లు, విమాన టికెట్ల రద్దు

విమాన బుకింగ్స్‌ నిలిపేసిన ఈజ్‌మైట్రిప్‌

ఆ దేశ మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో భారత్‌లో ఆగ్రహావేశాలు

లక్షద్వీప్‌పై పెరిగిన ఆసక్తి.. ఊపందుకున్న ‘చలో లక్షద్వీప్‌’

నీలి రంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. తెల్లటి ఇసుక తిన్నెలు.. ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతి అందాలు.. వెరసి మాల్దీవులు...! హాలిడే్‌సలో జీవితాన్ని సరదాగా గడపడానికి అందరూ ఎంచుకునే అందమైన పర్యాటక ప్రాంతం. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే హాలిడే స్పాట్‌..! అయితే ఇదంతా ఇక గతం..! ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్‌, మజూమ్‌ మాజిద్‌.. చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలతో ఉన్న భారతీయులంతా ఇప్పుడు మాల్దీవులను బహిష్కరిస్తున్నారు. బాలీవుడ్‌ సెలెబ్రిటీల నుంచి బడాబడా వ్యాపారులు, సాధారణ పర్యాటకుల వరకూ అందరూ ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’కు మద్దతు తెలుపుతున్నారు. గతవారం లక్షద్వీ్‌పలో పర్యటించిన ప్రధాని మోదీ బీచ్‌లను సందర్శించి అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన తర్వాత ఈ రగడ మొదలైంది. మాల్దీవుల మంత్రులు భారత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మోదీని విదూషకుడిగా.. ఇజ్రాయెల్‌ చేతిలో కీలుబొమ్మగా అభివర్ణించారు. దీనిపై దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది. అయినప్పటికీ భారతీయుల ఆగ్రహం చల్లారలేదు. చాలామంది ఈ ద్వీపదేశానికి వెళ్లాల్సి ఉన్న తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17,57,939 మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్లారు. ఇందులో 2,09,198లక్షల మందితో భారత్‌ టాప్‌లో ఉండగా.. రష్యా (2,09,146), చైనా (1,87,118) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకం. కాబట్టి ఇప్పుడు భారతీయులు దీన్ని బహిష్కరిస్తే ఆ దేశ ఆర్థిక రంగానికి కోలుకోలేని దెబ్బేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

8వేల హోటల్‌ బుకింగ్స్‌ రద్దు..!

భారత్‌లోని సోషల్‌ మీడియాలో ఇప్పుడు ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే ఆ దేశంపై ఆగ్రహావేశాలు కేవలం సోషల్‌ మీడియా పోస్టులకే పరిమితం కాలేదు. వేలాది మంది భారతీయులు ఇప్పటికే వచ్చే సెలవుల్లో అక్కడికి వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న విమాన టికెట్లు, హోటల్‌ రూమ్‌లను రద్దు చేసుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో ఇప్పటి వరకూ దాదాపు 8000 హోటల్‌ బుకింగ్స్‌, 2,500 విమాన టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. కాగా, ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లోని ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీ్‌పపై ఆసక్తి పెరిగింది. అయితే.. మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత సామాజిక మాధ్యమాల్లో ‘చలో లక్షద్వీప్‌’ ఉద్యమం ఊపందుకుంది.

భారత్‌పై మాల్దీవులు ఎలా ఆధారపడుతోంది?

మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు మద్దతునిచ్చేందుకు ఈ దేశంలోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుధ్యం వంటి మౌలికవసతుల ప్రాజెక్టుల్లో భారత్‌ భాగస్వామ్యమైందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హరిమదూ అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టు, గన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రీ డెవల్‌పమెంట్‌ వంటి ఎనిమిది ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్‌లోని లగ్జరీ హోటళ్లయిన తాజ్‌, ఒబెరాయ్‌ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్‌ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతోపాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికి 1974 నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐలాండ్‌ రిసార్ట్స్‌ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం అందిస్తోంది.

నష్ట నివారణ చర్యలు చేపట్టిందా..!

భారత్‌ అవసరం తమకు ఎంతగానో ఉందని ఆ దేశ నాయకులు గుర్తించారు. అందుకే జరగబోయే నష్టాన్ని గుర్తించి నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ మాట్లాడుతూ.. విదేశీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఏదేమైనప్పటికీ ఆయా వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ దేశం తన భాగస్వాములందరితో ముఖ్యంగా పొరుగు దేశాలతో సానుకూలంగా ఉండేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

లక్ష్యద్వీ్‌పపై ఆసక్తి పెరిగింది: మేక్‌మైట్రిప్‌..

లక్షద్వీ్‌పలో ప్రధాని మోదీ పర్యటన తర్వాత తమ ఆన్‌లైన్‌ వేదికలో ఈ దీవుల కోసం వెతికే వారి సంఖ్య 3,400 శాతం పెరిగిందని ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ సోమవారం ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించింది. అద్భుతమైన ఈ బీచ్‌లను అన్వేషించేలా భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు త్వరలోనే సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు అందజేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.. మరోవైపు, మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌ ఆ దేశానికి విమాన టికెట్ల బుకింగ్‌ను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌ పిట్టి ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలందిస్తోంది. అలాగే ఇటీవల మోదీ పర్యటించిన లక్షద్వీ్‌పను ప్రమోట్‌ చేయడానికి ఈ సంస్థ ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చింది.

లక్షద్వీ్‌పలో డీశాలినేషన్‌కు రెడీ: ఇజ్రాయెల్‌

ఒకపక్క భారత్‌-మాల్దీవుల మధ్య వివాదం ముదురుతున్న తరుణంలో.. లక్షద్వీ్‌పలో పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీ్‌పలో డీశాలినేషన్‌ (లవణ నిర్మూలన) కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ‘డీశాలినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేం గతేడాది నుంచి లక్షద్వీ్‌పలో ఉన్నాం. మంగళవారం నుంచే ఆ పనులు ప్రారంభిస్తున్నాం’ అని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించింది. లక్షద్వీ్‌పలోని కొన్ని బీచ్‌ల ఫొటోలు పంచుకుంటూ.. ‘‘సహజసిద్ధమైన, నీటి అడుగున ఉండే అందాలను ఇప్పటికీ చూడని వారికోసం కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి’’ అని ట్వీట్‌ చేసింది. - సెంట్రల్‌ డెస్క్‌

అన్ని వేళలా అండగాఉన్నా కూడా

2021లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో మాల్దీవులకు భారత్‌ వ్యాక్సిన్లు అందించింది. భారత్‌ నుంచి వ్యాక్సిన్లు పొందిన తొలి దేశం ఇదే కావడం గమనార్హం. వ్యాక్సిన్ల ఎగుమతి ఆంక్షలు, దేశీయ అవసరాలు ఉన్నప్పటికీ ఆ ఏడాది ఆ దేశానికి మూడు నెలల్లోనే 3 లక్షల డోసులు పంపించింది. ఇప్పుడే కాదు కొన్నేళ్లుగా భారత్‌ ఈ దేశానికి ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది. కొవిడ్‌ సమయంలో వూహాన్‌ నుంచి మాల్దీవుల ప్రజలను తరలించడంలో సహాయం చేయడం.. మాలేకు వైద్య బృందాలను పంపడం.. హనిమధూ విమానాశ్రయ అభివృద్ధి.. ఇలా మాల్దీవులకు భారత్‌ చేసిన సహాయాల జాబితా చాలా పెద్దదే. అలాగే పలువురు మాల్దీవుల అధికారులు భారత్‌లోని వివిధ ఇనిస్టిట్యూట్‌లలో శిక్షణ పొందుతున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 04:16 AM