30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:29 AM
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 30కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ కూడా ఒట్టివేనని తనిఖీల్లో తేలింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయెన్స్
ఒక్కరోజే 30కిపైగా సర్వీసులకు.. అన్నీ ఒట్టివే
వారంలో 70కిపైగా విమానాలకు హెచ్చరికలు
పండగ సీజన్‌లో సంస్థలకు రూ.కోట్లలో నష్టం
కంపెనీల సీఈవోలతో బీసీఏఎస్ డీజీ సమావేశం
ఎన్నికలతో.. రాజకీయ కోణంపై అనుమానాలు
న్యూఢిల్లీ, అక్టోబరు 19: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 30కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ కూడా ఒట్టివేనని తనిఖీల్లో తేలింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయెన్స్ ఎయిర్ సంస్థలకు చెందిన విమానాలకు తాజాగా బెదిరింపులు వచ్చాయి. వీటిలో దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి. విస్తారాకు చెందిన ‘ఉదయ్‌పూర్-ముంబయి’ విమానం మరుగుదొడ్డిలో.. విమానంలో బాంబు పెట్టినట్లుగా ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యమైంది. వారం రోజుల్లో ఇప్పటి వరకూ కనీసం 70 విమానాలకు ఈ రకంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. లండన్, అమెరికా, జర్మనీ, కెనడా తదితర దేశాల నుంచి ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఇవి వస్తున్నట్లు ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్ర్‌సల ద్వారా అధికారులు గుర్తించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో, దేశీయ విమానయాన సంస్థల సీఈఓలతో ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ శనివారం సమావేశమయ్యారు. నకిలీ బెదిరింపుల నివారణకు అవసరమైన చర్యల గురించి చర్చించారు. అనంతరం హసన్ ఒక ప్రకటన జారీ చేస్తూ.. ‘భారత గగనతలం పూర్తిగా సురక్షితంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి పటిష్ఠమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఎటువంటి భయాందోళన లేకుండా విమానయానం చేయవచ్చని ప్రయాణికులకు హామీ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. బీసీఏఎ్‌సతోపాటు, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) త్వరలో నూతన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బెదిరింపు ఘటనలకు సంబంధించి ముంబై, ఢిల్లీల్లో డజనుకుపైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 4 విమానాలకు అతడు బెదిరింపులు పంపినట్లు వెల్లడైంది. తన స్నేహితులతో గొడవల నేపథ్యంలో వారిని ఇరికించటానికి ఈ పని చేసినట్లు విచారణలో ఆ బాలుడు వెల్లడించాడు.
రూ.కోట్లలో నష్టం
నకిలీ బాంబు బెదిరింపుల వల్ల విమానయాన సంస్థలకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతోంది. విమానాలను మార్గమధ్యంలోనే దింపివేయటం, ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయటం, వేరే విమానాల్లో వారిని గమ్యస్థానానికి పంపించటం, ఇంధనం వృథా మొదలైన వాటితో.. ఒక్కో బాంబు బెదిరింపు ఘటనలో కంపెనీపైన సగటున రూ.3 కోట్ల భారం పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 14న ఎయిర్‌ఇండియా బోయింగ్ 777 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. 16 గంటలపాటు ప్రయాణించాల్సిన విమానం.. బాంబు బెదిరింపుతో రెండు గంటల్లోనే ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అలాగే, ఎయిర్ ఇండియాకే చెందిన ఢిల్లీ-షికాగో విమానానికి కూడా ఈ నెల 15వ తేదీన బాంబు బెదిరింపు రావటంతో విమానాన్ని కెనడాలోని ఓ నగరంలో దింపివేశారు. ఎంతో డిమాండ్ ఉండే పండగ సీజన్‌లో ఈ విధమైన బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
రాజకీయ కోణం?
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. విమానాలకు బెదిరింపులు మొదలుకావటం, అవి రోజురోజూకూ పెరిగిపోవటంతో.. వీటి వెనుక ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా.. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిన వందలాది స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతిని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో పలు దశల పోలింగులో, పోలింగ్‌కు సరిగ్గా 2-3 రోజుల ముందు స్కూళ్లలో బాంబు పెట్టినట్లుగా బెదిరింపులు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి విమానాల బాంబు బెదిరింపుల్లాగే నాడు స్కూళ్లకు వచ్చిన బెదిరింపులన్నీ ఒట్టివేనని తేలింది. పిల్లలు, తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు గురయ్యారు.