Share News

ఎమ్మెస్పీకి చట్టబద్ధత ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Feb 15 , 2024 | 02:57 AM

కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీకి చట్టబద్ధతనిచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. రైతు నేత సర్వణ్‌సింగ్‌ పంధీర్‌ మీడియాతో మాట్లాడుతూ..

ఎమ్మెస్పీకి చట్టబద్ధత ఇవ్వాల్సిందే

రైతు సంఘాల డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీకి చట్టబద్ధతనిచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. రైతు నేత సర్వణ్‌సింగ్‌ పంధీర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టియర్‌గ్యా్‌సను ప్రయోగించడం వల్ల చాలా మంది రైతులు గాయపడ్డారని, పలువురు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. కేంద్రం ఇలాంటి చర్యలను నిలువరించి, చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. తాము కేంద్రతో ఘర్షణకు రాలేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే తమ పోరాటమని వివరించారు. మరో నేత జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ కూడా ఎమ్మెస్పీనే తమ ప్రధాన డిమాండ్‌ అని, స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయాలని పేర్కొన్నారు.

మోదీది నియంతృత్వ పోకడ: కాంగ్రెస్‌

రైతులపై పోలీసుల దాడిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాటి దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు గుర్మీత్‌ సింగ్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. దేశానికి అన్నంపెడుతున్న రైతులపై ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఎక్స్‌లో మండిపడ్డారు. రైతులకు తాము అండగా ఉంటామని గుర్మీత్‌కు ధైర్యం చెప్పారు. కాగా, ఝార్ఖండ్‌లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన రెండో విడత భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు అయ్యింది. రైతుల చలో ఢిల్లీ ఆందోళనలో పాల్గొనేందుకు రాహుల్‌ దేశ రాజధానికి వెళ్లడంతో యాత్రను రద్దు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌ ఇప్పటిది కాదని, 2011లో కూడా గుజరాత్‌ సీఎంగా మోదీ ఇదే డిమాండ్‌ చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ గుర్తుచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మోదీ ఎమ్మెస్పీ గురించి ప్రస్తావించినట్లు చెప్పారు.

Updated Date - Feb 15 , 2024 | 07:53 AM