Share News

Mallikarjun Kharge: మోదీ మళ్లీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:20 AM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వంవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. రష్యాలో పుతిన్‌ పాలించినట్టుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు.

Mallikarjun Kharge: మోదీ మళ్లీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

నియంతృత్వంవైపే ఆయన మొగ్గు.. పుతిన్‌లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం

ఆరెస్సెస్‌ భావజాలం విషపూరితం.. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి: ఖర్గే

భువనేశ్వర్‌, జనవరి 29: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వంవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. రష్యాలో పుతిన్‌ పాలించినట్టుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలకు ఉన్న చివరి అవకాశం రానున్న ఎన్నికలేనని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీలపై ఘాటు విమర్శలు చేశారు. వాటి సిద్ధాంతాలు విషపూరితమని, అందువల్ల వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను బెదిరించడం ద్వారా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలు బీజేపీ చేతిలో ఆయుధాలుగా మారాయని విమర్శించారు. బీజేపీ-ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను వ్యతిరేకించే రాజకీయ నాయకులను వారి సొంత పార్టీలను వీడేలా బెదిరిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆఎస్‌ఎస్‌లను వ్యతిరేకిస్తున్నందుకు రాహుల్‌ గాంధీకి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఖర్గే చెప్పారు. అయితే రాహుల్‌ వాటిని లెక్కచేయడం లేదని, దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇండియా కూటమిని విడిచిపెట్టడంపై స్పందిస్తూ ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికలపై ప్రభావం పడదని అన్నారు.

70 ఏళ్లలో దేశానికి కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపైనా ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘‘మీరు గుజరాత్‌ ముఖ్యమంత్రి, ప్రధాని కాగలిగారంటే కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం వల్లనే సాధ్యమయింది. మరి మీరేమో ప్రజాస్వామ్య, రాజ్యాంగ మూల సూత్రాలనే నాశనం చేస్తున్నారు’’ అని విమర్శించారు. మోదీని అబద్ధాలకోరు అని అభివర్ణించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 లక్షల ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పైనా విమర్శలు చేశారు. ఒడిశాలో కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కర్మాగారాల జాబితాను వివరిస్తూ రాష్ట్రానికి నవీన్‌ ఏమి చేశారని ప్రశ్నించారు. జవహర్‌లాల్‌ నెహ్రూకు, బిజూ పట్నాయక్‌కు మంచి స్నేహం ఉండేదని, కానీ నవీన్‌ పట్నాయక్‌ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను నమ్ముతున్నారని అన్నారు. ఒడిశాలో బీజేపీది, బిజూ జనతాదళ్‌ది ప్రేమ వివాహం అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 30 , 2024 | 06:31 AM