Share News

Ladakh: లడఖ్‌లో వేలాదిమంది రోడ్లపైకి.. అసలెందుకీ నిరసన? వారి డిమాండ్లు ఏంటి?

ABN , Publish Date - Feb 04 , 2024 | 05:26 PM

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఎప్పుడూ లేనంతగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం.. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి.

Ladakh: లడఖ్‌లో వేలాదిమంది రోడ్లపైకి.. అసలెందుకీ నిరసన? వారి డిమాండ్లు ఏంటి?

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఎప్పుడూ లేనంతగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం.. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ కూడా మద్దతు తెలిపారు. ఈ నిరసనల కారణంగా లడఖ్ మొత్తం స్తంభించిపోయింది. అక్కడి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.


నిరసనల వెనుక కారణం

లడఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ రక్షణ కల్పించాలని అక్కడి ప్రజలు కోరుతూ ఈ భారీ ప్రదర్శనకు దిగారు. అలాగే.. లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను కేటాయించాలని.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. లడఖ్ ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏ సంస్థలైతే ఈ ఉద్యమానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయో.. వారితో చర్చలు జరుపుతామని కూడా నిత్యానంద రాయ్ తెలిపారు. అయినప్పటికీ.. ఈ ఆందోళనలు కొనసాగడం గమనార్హం.

నిజానికి.. ఈ నిరసనలు జరగడానికి ముందే ప్రభుత్వం LAB, KDA ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం రెండో విడత చర్చలు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయినా.. ప్రజలు నిరసనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి.. కశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. కానీ.. రెండేళ్లలోనే లేహ్, కార్గిల్ ప్రజలు రాజకీయంగా తమ అధికారాలు బలహీనమయ్యాయని భావించారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి వీళ్లు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ వస్తున్నారు.

Updated Date - Feb 04 , 2024 | 05:26 PM