రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ దావా
ABN , Publish Date - Mar 24 , 2024 | 02:47 AM
కేరళ ప్రభుత్వం శనివారం అసాధారణ చర్యకు పాల్పడింది. కేరళ అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇందుకు కారణాలు కూడా చెప్పడం లేదని పేర్కొంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో
4 బిల్లులపై సంతకాలు చేయడం లేదు..
కారణాలూ చెప్పడం లేదని ఆరోపణ
ఆమోదించొద్దని కేంద్రం సలహా ఇచ్చినట్టు ఆక్షేపణ
రిట్ పిటిషన్‌లో ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శి పేరు
గవర్నర్ పైనా వ్యాజ్యం.. బిల్లులపై తాత్సారం చేస్తున్నారని విమర్శ
కోర్టు ఆర్డర్ల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రపతి పరిశీలనకు పంపారని వ్యాఖ్య
కోచి, మార్చి 23: కేరళ ప్రభుత్వం శనివారం అసాధారణ చర్యకు పాల్పడింది. కేరళ అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇందుకు కారణాలు కూడా చెప్పడం లేదని పేర్కొంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో దావా వేసింది. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పైనా దావా వేసింది. అసెంబ్లీ తీర్మానించిన ఈ బిల్లులను దీర్ఘకాలం, అనిశ్చితి కాలం పాటు తన వద్ద పెండింగ్‌లో పెట్టుకొని, చివరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపించడాన్ని కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందన్న కారణంతోనే ముందు జాగ్రత్తగా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్టు అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు-2022, విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు (నెంబరు-2)-2022, విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు (నెంబరు-3)-2022, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు-2022లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం పెట్టకపోవడాన్ని ఆ పిటిషన్‌లో ప్రశ్నించింది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఆమోదం తెలపకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరింది. ఈ నాలుగు బిల్లులతో పాటు మరో మూడు బిల్లులు...మొత్తం ఏడింటిని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించడాన్ని కూడా తప్పుపట్టింది. గవర్నర్ చర్యను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోరింది. ఈ ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం ద్వారా రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించినట్టయిందని, అందువల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం తన రిట్ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. అయితే, ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శిని పేర్కొంది. ఆరిఫ్‌ఖాన్‌పై పిటిషన్‌లో గవర్నర్‌ను, గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొనడం గమనార్హం. కేరళ అసెంబ్లీ 11 నుంచి 24 నెలల క్రితం ఆమోదించిన ఈ బిల్లులపై సంతకాలు చేయకుండా ఆపాలంటూ కేంద్రం రాష్ట్రపతికి సలహా ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించింది. ఈ బిల్లులన్నీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశాలని తెలిపింది. వీటికి అనుమతి నిరాకరించడం అంటే సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించడం, ఆటంకపరచడం కిందకే వస్తుందని వివరించింది.