Share News

కేజ్రీవాల్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:43 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌

మద్యం స్కాం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ

ఇదే కేసులో కవితను అరెస్టు చేసిన వారంలోనే!

ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే చాన్స్‌

ఇప్పటికే 9 సార్లు సమన్లు.. హాజరుకాని ఢిల్లీ సీఎం

గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి

కేజ్రీవాల్‌, ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్‌ స్వాధీనం

దాదాపు రెండు గంటలపాటు సోదాలు, ప్రశ్నలు

నేడు పీఎంఎల్‌ఏ కోర్టు ముందుకు.. కస్టడీకి వినతి

అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు

ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జిల తిరస్కరణ

ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్‌ కార్యకర్తల నిరసన

పెద్దఎత్తున మోహరించిన ఆర్‌ఏఎఫ్‌, సీఆర్పీఎఫ్‌

కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు: మంత్రి ఆతిషి

టార్గెట్‌ పూర్తయింది! గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ప్రచారానికి రూ.100 కోట్లు చేతులు మారాయని, అందుకు ఢిల్లీ మద్యం విధానాన్ని సరళీకరించారనే ఆరోపణలున్న కుంభకోణం క్లైమాక్స్‌కు చేరుకుంది! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది! దాంతో, దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం ముగిసినట్లే! ఈ కేసులో పాత్రధారులంతా అప్రూవర్లుగా మారిపోవడంతో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే! కాకపోతే.. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్‌ ఇప్పుడు అదే కేసులో అరెస్టు కావడమే వైచిత్రి!

న్యూఢిల్లీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. ఇదే కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను అరెస్టు చేసిన వారం రోజుల్లోనే ‘కుట్రదారు’గా పేర్కొన్న కేజ్రీవాల్‌నూ అరెస్టు చేయడం విశేషం. తద్వారా, ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టుల పర్వం క్లైమాక్స్‌కు చేరినట్లయింది. ఈ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఈ కుంభకోణంలో పాత్రపై కేజ్రీవాల్‌ను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్లు తెలిసింది. నిజానికి, ఢిల్లీ మద్యం స్కాంలో విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. కానీ, ఆయన హాజరు కాలేదు. దాంతో, గురువారం రాత్రి 7.45 గంటల సమయంలో పదోసారి సమన్లతో నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్నారు. సోదాలు చేసేందుకు తమ వద్ద వారంట్‌ ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి తెలిపారు. తొలుత కేజ్రీవాల్‌, ఆయన భార్య మొబైల్‌ ఫోన్లను, ఐప్యాడ్‌ను స్వాధీనపరుచుకున్నారు. అనంతరం రెండు గంటలపాటు 12 మంది అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనను ఈడీ ఆఫీసుకు తరలించేందుకు ప్రయత్నించగా రావడానికి ఆయన నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. చివరికి, రాత్రి 9.45 గంటల సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారం ఆయనను హాజరు పరుస్తామని, ఆయన కస్టడీకి అనుమతి కోరతామని ఈడీ అధికారులు తెలిపారు. అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత గురువారం రాత్రి ఈడీ కార్యాలయంలోనే కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్టు సమయంలో ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ కపిల్‌ రాజ్‌ అక్కడే ఉన్నారు. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 కింద కేజ్రీవాల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా, అవినీతి ఆరోపణలతో ఇటీవల అరెస్టైన రెండో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ నిలిచారు. కొద్ది రోజుల కిందట జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ల్యాండ్‌ స్కాం కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేనా.. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్‌ను ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలతో అరెస్టు చేయడం విశేషం.

ముందుగా ఊహించి కోర్టుకు వెళ్లినా..

తనను అరెస్టు చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన కేజ్రీవాల్‌ గురువారం ఉదయం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం స్కాంలో వరుసగా సమన్లు జారీ చేస్తున్న ఈడీ.. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన వినతిని హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత దశలో ఎలాంటి రక్షణ కల్పించలేమని న్యాయమూర్తులు జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ కైత్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. కేజ్రీవాల్‌ అరెస్టును అడ్డుకోవడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగింది. సెర్చ్‌ వారంట్‌తో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేసింది. దాంతో, కేజ్రీవాల్‌ అరెస్టు రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆయన తరఫు న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీం కోర్టు తలుపు త ట్టారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే, ఈ కేసును శుక్రవారం విచారిస్తామని సుప్రీం తెలిపింది.

కేజ్రీవాల్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత

కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడం, ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో ఆప్‌ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్దఎత్తున నిరసన తెలిపారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో, పోలీసులు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సీఆర్పీఎఫ్‌ దళాలను కేజ్రీవాల్‌ నివాసం వద్ద మోహరించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులను అష్ట దిగ్బంధనం చేసి పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తర ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే రహదారి అంతటా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144ను విధించి జనం ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఆప్‌ కార్యకర్తలు పోగవుతారని ఊహించే భారీగా బలగాలను కోరామని ఒక పోలీసు అధికారి తెలిపారు. కాగా.. ఈ అరెస్టుకు కేజ్రీవాల్‌ భయపడే ప్రసక్తి లేదని, తమ ధైర్య సాహసాలు చెక్కు చెదరబోవని ‘ఎక్స్‌’ వేదికగా ఆప్‌ ప్రకటించింది.

కేజ్రీవాలే ముఖ్యమంత్రి: ఆతిషి

నిర్బంధం నుంచే కేజ్రీవాల్‌ పాలన కొనసాగిస్తారని, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి ఆతిషీ ప్రకటించారు. పదవికి ఆయన రాజీనామా చేయబోరని స్పష్టం చేశారు. జైలు నుంచి పాలన సాగించేందుకు ఏ నిబంధనా అడ్డుకోలేదని తెలిపారు. ఈ కేసులో రెండేళ్లుగా విచారణ చేస్తున్నా ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్మును ఈడీ కనిపెట్టలేకపోయిందని ఆమె అన్నారు. ఈ కేసులో ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు ఇచ్చిందని, అయినా వేలాదిమంది పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం లోక్‌సభ ఎన్నికల ముందు మోదీ చేస్తున్న భారీ కుట్రగా ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ఆరోపించారు. కేజ్రీవాల్‌ కు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్‌ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచమంతా ప్రశంసిస్తోందని, ఆయనను అరెస్టు చేయవచ్చు కానీ ఆయన ఆశయాలను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

ఆప్‌ ఎన్నికల ప్రచారానికి వంద కోట్లు!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వివిధ మార్గాల ద్వారా పంపించిన వంద కోట్ల రూపాయలను ఆప్‌ తన ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఈడీ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులకు కవిత వంద కోట్ల ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇటీవల కవిత కస్టడీ రిపోర్టులోనూ ఈ వివరాలను పేర్కొంది. శరత్‌ చంద్రా రెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులతో సౌత్‌ లాబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న కవిత.. ఆప్‌ అగ్ర నేతలతో కుమ్మక్కయ్యారని పేర్కొం ది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇదే కేసులో గత ఏడాది ఏప్రిల్‌లో తొమ్మిది గంటలపాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్టై దాదాపు ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారు. ఇక, సౌత్‌ లాబీలోని మిగిలిన పాత్రధారుల్లో అత్యధికులు అప్రూవర్లుగా మారారు. ఇటీవల ప్రధాన కుట్రదారుగా పేర్కొంటున్న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడు కవిత ఇచ్చిన సమాచారంతో కేజ్రీవాల్‌ను విచారించడం, ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించడం ద్వారా ఈ కేసును క్లైమాక్స్‌కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఈడీ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 04:43 AM