Share News

కరుడుగట్టిన నేరగాళ్ల మధ్య కేజ్రీవాల్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:57 AM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహార్‌ జైలులో కరుడుగట్టిన నేరగాళ్ల పక్కన కాలం గడుపుతున్నారు.

కరుడుగట్టిన నేరగాళ్ల మధ్య కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహార్‌ జైలులో కరుడుగట్టిన నేరగాళ్ల పక్కన కాలం గడుపుతున్నారు. న్యాయస్థానం రెండు వారాల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో పోలీసులు ఆయనను రెండో నెంబరు జైలుకు తరలించారు. అక్కడ డాన్‌ ఛోటా రాజన్‌, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బవానా, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జియా ఉర్‌ రహ్మాన్‌లు ఇరుగుపొరుగు వారిగా ఉన్నారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ అయిన దావూద్‌ ఇబ్రహీంకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన ఛోటా రాజన్‌ అనంతర కాలంలో అతడికి ప్రత్యర్థిగా మారాడు. గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌పై హత్య, హత్యాయత్నం నేరాలు సహా 40కిపైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కేజ్రీవాల్‌ ఈ రెండు వారాల పాటు వారితో కలిసి కాలం గడపాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయనను ఈ జైలుకు తీసుకువచ్చారు. రాత్రంతా చికాకుగానే గడిపారు. సుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఇంటి నుంచే తీసుకొచ్చేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. మంగళవారం ఉదయం 6.40 గంటలకు అల్పాహారం కింద టీ, బ్రెడ్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌ సెల్‌లోనే గంట సేపు యోగా, ఽధ్యానం చేశారు. ప్రతి రోజూ అయిదు నిమిషాల పాటు ఫోనులో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు. తనను కలిసేందుకు ఆరుగురికి అవకాశం ఇవ్వాలంటూ ఆయన జాబితాను సమర్పించారు. భార్య సునీత, కుమారుడు, కుమార్తె, ప్రైవేటు సెక్రటరీ బిభావ్‌ కుమార్‌, ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

సంజయ్‌సింగ్‌కు బెయిల్‌

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ధర్మాసనం తెలిపింది. రాజకీయ సమావేశాల్లో పాల్గొనవచ్చునని, అయితే మద్యం విధానం కుంభకోణం కేసుకు సంబంధించి మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన్ను ఆదేశించింది. నిరుడు అక్టోబరు 4న సంజయ్‌ సింగ్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

కేజ్రీ ఐఫోన్‌ అన్‌లాక్‌కు యాపిల్‌ ‘నో’

కేజ్రీవాల్‌ ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు ఈడీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం కేజ్రీవాల్‌ ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేయాలని యాపిల్‌ కార్యాలయాన్ని ఈడీ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అనధికారంగా చేసిన ఈ వినతిని యాపిల్‌ తిరస్కరించినట్లు సమాచారం. తమ కంపెనీ నిబంధనల ప్రకారం ఫోన్‌ సొంతదారు మాత్రమే దాని లాక్‌ను తెరవగలరని యాపిల్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌ తన ఐఫోన్‌కు లాక్‌ వేసి స్విచ్చాఫ్‌ చేశారు.

Updated Date - Apr 03 , 2024 | 08:42 AM