Share News

కర్ణాటకలో కరసేవకుడి అరెస్టు.. బీజేపీ ఆగ్రహం

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:51 AM

అయోధ్యలో రామాలయ ప్రారంభ వేళ కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సరికొత్త వివాదంలో చిక్కుకుంది.

కర్ణాటకలో కరసేవకుడి అరెస్టు.. బీజేపీ ఆగ్రహం

బెంగళూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామాలయ ప్రారంభ వేళ కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. అయోధ్యలో 1992 నాటి రామ మందిర ఉద్యమంలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హుబ్బళ్లిలో స్థానిక కరసేవకుడు శ్రీకాంత్‌ పూజారిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కేసును తిరగదోడి, రామభక్తులను అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్‌ తన హిందూ వ్యతిరేకతను చాటుకుంటోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. కరసేవకుడి అరెస్టును ఖండిస్తూ బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. కాగా కరసేవకుడి అరెస్టుపై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, మతాన్ని లాగుతోందని సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. పాత కేసులను క్లియర్‌ చేయాలని న్యాయస్థానాలు చేసిన సూచన మేరకు, అప్పట్లో హింసకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారని తెలిపారు. ఇది విద్వేష రాజకీయం కాదని, రామభక్తులను తాము ఎక్కడా వేధించడం లేదని స్పష్టం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 06:45 AM