Share News

లోక్‌సభ బరిలో కంగనా రనౌత్‌

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:42 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ఆదివారం ప్రకటించింది. 18 రాష్ట్రాలకు చెందిన 111 మందికి ఈ జాబితాలో చోటు లభించింది.

లోక్‌సభ బరిలో కంగనా రనౌత్‌

హిమాచల్‌ నుంచి పోటీకి సినీనటి

మేనకకు టికెట్‌, వరుణ్‌కు మొండిచేయి

కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయకు అవకాశం

111 మందితో బీజేపీ 5వ జాబితా

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ఆదివారం ప్రకటించింది. 18 రాష్ట్రాలకు చెందిన 111 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. కాగా బీజేపీలో ఆదివారమే చేరిన కాంగ్రెస్‌ మాజీ నేత, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌కు టికెట్‌ దక్కటం విశేషం. హరియాణాలోని కురుక్షేత్ర నుంచి ఆయన బరిలో ఉండనున్నారు. సినీనటి కంగనా రనౌత్‌కు బీజేపీ తొలిసారిగా అవకాశం ఇచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి కంగన.. ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. రామాయణ్‌ సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌కు మీరట్‌ సీటు కేటాయించారు. పశ్చిమ బెంగాల్‌ సందేశ్‌ఖాళీ ఘటన బాధితురాలైన రేఖాపాత్రకు బసీర్‌హాట్‌ నియోజకవర్గం నుంచి, అదే రాష్ట్రంలో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయకు తమ్లుక్‌ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీకి తిరిగి అవకాశం కల్పించినప్పటికీ.. ఆమె కుమారుడు వరుణ్‌గాంధీకి మొండిచేయి చూపారు. వరుణ్‌ గాంధీ సిటింగ్‌స్థానం ఫిలిబిట్‌ను.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జితేంద్ర ప్రసాదకు కేటాయించారు. సైనికదళాల మాజీ ప్రధానాధిపతి జనరల్‌ వీకే సింగ్‌కు ఆయన సిటింగ్‌ స్థానమైన ఘజియాబాద్‌లో సీటు నిరాకరించారు. జార్ఖండ్‌లో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌కు డుంకా నుంచి అవకాశమిచ్చారు.

Updated Date - Mar 25 , 2024 | 04:42 AM