Share News

కేరళలో కమల వికాసం ఖాయం

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:52 AM

ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ ప్రభుత్వాల అవినీతి, అసమర్థ పాలనలో కేరళ ప్రజలు ఎన్నో కష్టాలు భరించారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన దక్షిణ కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గణనీయ ప్రాబల్యం ఉన్న క్రైస్తవ కమ్యూనిటీతో భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

కేరళలో కమల వికాసం ఖాయం

పతనంతిట్ట(కేరళ): ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ ప్రభుత్వాల అవినీతి, అసమర్థ పాలనలో కేరళ ప్రజలు ఎన్నో కష్టాలు భరించారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన దక్షిణ కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గణనీయ ప్రాబల్యం ఉన్న క్రైస్తవ కమ్యూనిటీతో భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘గత ఎన్నికల్లో కేరళ ప్రజలు మమ్మల్ని రెండంకెల ఓట్ల శాతం కలిగిన పార్టీని చేశారు. ఇక్కడ మేం రెండంకెల సీట్ల లక్ష్యాన్ని సాధించే రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కమలం వికసించడం ఖాయం’’ అని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ కె. ఆంటోనీని యువతకు ప్రతినిధిగా మోదీ అభివర్ణించారు. గతేడాది కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరిన అనిల్‌ ఆంటోనీ రాబోయే ఎన్నికల్లో పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ పాల్గొనే రోడ్‌ షోకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ఎస్‌ పురంలో ప్రధాని మోదీ ఈ నెల 18న బీజేపీ నిర్వహించే రోడ్‌ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఇక్కడ 1998లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఇక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోయంబత్తూరు జిల్లా పోలీసులు రోడ్‌షోకు అనుమతించలేదు. అయితే, 4 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించుకునేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Updated Date - Mar 16 , 2024 | 04:52 AM