Share News

కేరళ పాలిట చీకటి మాసాలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:57 AM

జూలై-ఆగస్టు నెలలు కేరళ పాలిట చీకటిమాసాలనే పేరు ఉంది. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో నమోదైనవిపత్తుల్లో అతి పెద్దవి ఈ రెండు నెలల్లో సంభవించినవే. ఇటీవలి ఉదాహరణలే తీసుకుంటే.. 2020 ఆగస్టు 6న ఇడుక్కిజిల్లాలోని పెట్టిముడిలో ఇదే

కేరళ పాలిట చీకటి మాసాలు

జూలై, ఆగస్టు నెలల్లో అతి పెద్ద విపత్తులు

తిరువనంతపురం: జూలై-ఆగస్టు నెలలు కేరళ పాలిట చీకటిమాసాలనే పేరు ఉంది. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో నమోదైనవిపత్తుల్లో అతి పెద్దవి ఈ రెండు నెలల్లో సంభవించినవే. ఇటీవలి ఉదాహరణలే తీసుకుంటే.. 2020 ఆగస్టు 6న ఇడుక్కిజిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలో భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు.. 2019 ఆగస్టు 8న మలప్పురం, వయనాడ్‌, కోళికోడ్‌ జిల్లాల్లోని కవలప్పర, పుదుమాల, విలంగాడ్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 76 మంది చనిపోయారు. వారిలో 16 మంది మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. 2021లో ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. ఇక.. 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదలపై ఒక సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వరదల్లో 483 మంది చనిపోయారు. 15 మంది మృతదేహాలు దొరకలేదు. ఆ వరదల దెబ్బకు.. 14 జిల్లాల పరిధిలో పది లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ఏడాది వర్షపాతం సాధారణం కంటే 23ు అధికంగా ఉండడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి! దీంతో కేరళలోని 54 డ్యాముల్లో 35 డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు. ఒకేసారి అన్ని డ్యాములను తెరవడం ఆ రాష్ట్ర చరిత్రలోనే అది మొదటిసారి. ఆ సమయంలో కేరళలో దాదాపు 5000 చిన్న, పెద్ద కొండ చరియలు విరిగిపడినట్టు ఒక అంచనా. కేరళలో ఏడుపదులు దాటిన వృద్ధులంతా కథలు కథలుగా చెప్పేది.. 1974 విలయం గురించే! ఆ ఏడాది జూలై 26ను ఒక భయానక రాత్రిగా వారు అభివర్ణిస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండడంతో కొండచరియలు విరిగిపడి 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ ప్రణాళిక 2016 ప్రకారం.. ఆ రాష్ట్రంలో 1961-2016 నడుమ కొండచరియలు విరిగిపడి మరణించినవారి సంఖ్య 295. కాగా.. అడవుల నిర్మూలన, పర్యావరణ మార్పు, పెరుగుతున్న భూతాపం, అరేబియా ఉపరితల జలాలు వేడెక్కడం వంటివాటివల్లే 2018, ఆ తర్వాత సంవత్సరాల్లో కేరళలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉండగా.. వాటిలో ఒక్క అలప్పుజ తప్ప మిగతా 13 జిల్లాలూ వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పును ఎదుర్కొంటున్నవేనని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అరేబియా సముద్రం వేడెక్కుతుండడంతో.. కేరళలోని పలు ప్రాంతాల్లో డీప్‌ క్లౌడ్‌ సిస్టమ్స్‌ ఏర్పడి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని.. కొండ చరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని కొచ్చిన్‌ వర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ రాడార్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ అభిలాష్‌ తెలిపారు.

Updated Date - Jul 31 , 2024 | 05:57 AM