Share News

IITians : ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు

ABN , Publish Date - May 24 , 2024 | 05:46 AM

ఐఐటీలో సీటు లభించిందంటే ఇక బంగారు భవిష్యత్తే అని అనుకుంటాం. కోర్సు పూర్తి కావస్తుండగానే స్వయంగా కంపెనీలే వచ్చి లక్షలు, కోట్లలో వార్షిక వేతనాలు ఆఫర్‌ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటాయని వింటాం. కానీ, ఐఐటీల ప్రభ క్రమంగా మసకబారుతోందని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2023-24 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల్లో 38 శాతం

IITians : ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు

ఈ ఏడాది 7 వేల మందికి దొరకని కొలువులు

ఏటా పెరుగుతున్న సమస్య.. బిట్స్‌లోనూ ఇదే పరిస్థితి

చాట్‌ జీపీటీ, పలు దేశాల్లో ఎన్నికల ప్రభావంతోనే..!

పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ ఐఐటీల లేఖలు

న్యూఢిల్లీ, మే 23: ఐఐటీలో సీటు లభించిందంటే ఇక బంగారు భవిష్యత్తే అని అనుకుంటాం. కోర్సు పూర్తి కావస్తుండగానే స్వయంగా కంపెనీలే వచ్చి లక్షలు, కోట్లలో వార్షిక వేతనాలు ఆఫర్‌ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటాయని వింటాం. కానీ, ఐఐటీల ప్రభ క్రమంగా మసకబారుతోందని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2023-24 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల్లో 38 శాతం మందికి (7 వేల మందికిపైగా) ఇంకా ఉద్యోగాలు దొరకలేదని తాజాగా వెల్లడైంది. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌సింగ్‌ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకని పరిస్థితుల నేపథ్యంలో పలు ఐఐటీలు.. వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలుగా ఉన్న తమ పూర్వ విద్యార్థులకు లేఖలు రాసి, వారి సహకారాన్ని అర్థించినట్లు వెల్లడైంది. ప్రస్తుత బ్యాచ్‌లో దాదాపు 400 మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ఇంకా ఉద్యోగాలు లభించలేదని, వారికి తమ తమ కంపెనీల్లో అవకాశాలు లభించేలాగానీ, ఇతర కంపెనీలకు సిఫార్సు చేయటంగానీ, అప్రెంటిషిప్‌ దొరికేలాగానీ సహకరించాలని పేర్కొంటూ ఢిల్లీ ఐఐటీలోని కెరీర్‌ సర్వీస్‌ కార్యాలయం తమ పూర్వ విద్యార్థులకు మెయిల్‌ చేసింది. 2023-24 బ్యాచ్‌కు చెందిన పట్టభద్రుల్లో దాదాపు 10 శాతం (250) మందికి ఇంకా ప్లేస్‌మెంట్లు లభించలేదని పేర్కొంటూ ఐఐటీ బాంబే కూడా పూర్వ విద్యార్థుల సాయం కోరింది. కాగా, ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన గత ఏడాది బ్యాచ్‌కు చెందిన 329 మందికి, 2022 బ్యాచ్‌కు చెందిన 171 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు లభించలేదని ఆర్‌టీఐ సమాచారం వెల్లడించింది. మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్‌ రెండు నెలల కిందటే పూర్వ విద్యార్థుల సాయం కోరుతూ మెయిల్‌ చేసిందని, ఇదే బాటలో ఐఐటీలు లేఖలు పంపుతున్నాయని తెలిసింది. దీనిపై ధీరజ్‌సింగ్‌ మాట్లాడుతూ, రెండేళ్ల కిందట ప్లేస్‌మెంట్‌ దొరకని ఐఐటీ విద్యార్థుల సంఖ్య 3,400 కాగా, ఈ ఏడాది అది 7 వేలకుపైగా పెరిగిందన్నారు. ఈ పరిణామంపై బిట్స్‌ గ్రూపుసంస్థల వీసీ వీ రాంగోపాల్‌రావు స్పందిస్తూ.. ‘ఈ ఏడాది చాట్‌ జీపీటీ తదితర లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ల ప్రభావం గణనీయంగా ఉంది. ముగ్గురు పని చేసే చోట ఇద్దరితో నడుస్తోంది. అదీగాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అనేక సంస్థలు నియామకాల విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నాయి. అందువల్లే ప్లేస్‌మెంట్లు 20 నుంచి 30 శాతం తగ్గాయి’ అని విశ్లేషించారు.

Updated Date - May 24 , 2024 | 05:46 AM