Share News

జన్‌ ధన్‌ యోజన సాధికారతకు చిహ్నం

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:55 AM

ప్రధాని మోదీ 2014లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన’ కార్యక్రమం బుధవారానికి సరిగ్గా పదేళ్లు పూర్తిచేసుకుంది. దీనిపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. గౌరవం, సాధికారతకు ఈ కార్యక్రమం

జన్‌ ధన్‌ యోజన సాధికారతకు చిహ్నం

53 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు

వాటిలో 2.3 లక్షల కోట్ల నిల్వ: ప్రధాని

పథకానికి బుధవారంతో పదేళ్లు పూర్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధాని మోదీ 2014లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన’ కార్యక్రమం బుధవారానికి సరిగ్గా పదేళ్లు పూర్తిచేసుకుంది. దీనిపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. గౌరవం, సాధికారతకు ఈ కార్యక్రమం చిహ్నమని, కోట్లాది మంది దేశ ఆర్థికాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ఇది అవకాశం కల్పించిందని తెలిపారు. ‘ఈ పథకం కింద కొత్తగా 53 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల్లో రూ.2.3 లక్షల కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి’’ అని వెల్లడించారు. జన్‌ధన్‌ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా ప్రజలకు వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద రూ.39లక్షల కోట్ల నగదు బదిలీ జరిగిందన్నారు. ‘‘మహిళల సాధికారతకు ఈ స్కీం గేమ్‌చేంజర్‌గా మారింది. 30 కోట్ల మంది మహిళలను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చాం’’ అని చెప్పారు. జన్‌ ధన్‌ యోజన లేకుంటే ముద్ర యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి సామాజిక భద్రత పథకాలు విజయవంతమయ్యేవి కావని వ్యాఖ్యానించారు. ఈ పథకం అవసరమా అని హేళన చేసినవారే ఇప్పుడు డిజిటల్‌ చెల్లింపుల అవసరమేంటని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ‘ప్రజల సమష్టి సంకల్పాన్ని వారు తక్కువ అంచనా వేశారు. భారత డిజిటల్‌ చెల్లింపులు విజయవంతం కావడాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల్లో 40ు భారత్‌లోనే జరుగుతున్నాయి’’ అన్నారు.

సెప్టెంబరులో అమెరికాకు మోదీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట, సెప్టెంబరు మూడో వారంలో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. 22న న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. కాగా.. 2019 సెప్టెంబరు 22న హూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఆ సభకు నాటి అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యారు.

Updated Date - Aug 29 , 2024 | 05:55 AM